logo

వినతుల సమర్పణ.. పరిష్కారానికి కార్యాచరణ

ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 21 Mar 2023 02:17 IST

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు పాలనాధికారిణి

మెదక్‌, న్యూస్‌టుడే: ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 81 అర్జీలు అందగా, అందులో 41 ధరణి, భూసమస్యలు, పోడుభూములకు సంబంధించినవి వచ్చాయి. మిగతావి రెండుపడకగదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు అందడం లేదని ఇచ్చారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తూ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చాలని పాలనాధికారి, జిల్లా అధికారులకు సూచించారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని, ప్రత్యేక తరగతులను మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. లోటుపాట్లను డీఈవోకు తెలియజేయాలన్నారు.

వసతులు లేక సతమతం

మెదక్‌ పట్టణ పరిధి పిల్లికొట్టాల్‌లో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల సముదాయాల వద్ద కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు నాగరాజు, లక్ష్మి, శంకరమ్మ, మంజుల, పద్ద, శ్యామల, రేణుక, లక్ష్మమ్మ, సిద్దమ్మ, యాదమ్మ వాపోయారు. విద్యుత్తు, మంచినీరు, మురుగుకాలువ సౌకర్యం లేదని వాపోయారు. మున్సిపల్‌ ట్యాంకర్‌ రెండు రోజులకోకసారి వస్తోందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు.

పిల్లికొట్టాల్‌లోని రెండు పడకగదుల ఇళ్ల వద్ద సౌకర్యాలు లేవని చెబుతున్న మహిళలు


తప్పుడు పౌతీ చేశారు
- వెంకటేశ్‌యాదవ్‌, తూప్రాన్‌

తూప్రాన్‌లో మా తాత పెంటయ్య పేరిట 19 గుంటల భూమి ఉంది. ఆయన మరణాంతరం ముగ్గురు కొడుకులకు రావాల్సిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తమ చిన్నాన్న అబోతు కొమురయ్య కొనుగోలు చేసినట్టు 2021లో తహసీల్దార్‌ కార్యాలయంలో పౌతీ ద్వారా మార్పిడి చేశారు. దీనిని రద్దు చేసి మా తాతకు చెందిన ముగ్గురు కొడుకులకు ఇప్పించాలి.


దళిత బంధు ఇప్పించాలి
- అబ్బుగారి యాదగిరి, నారాయణపూర్‌, నర్సాపూర్‌

పుట్టుకతో దివ్యాంగుడిని కావడంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. భార్య కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి పేరిట 25 గుంటల వ్యవసాయ భూమి తప్ప, ఎలాంటి ఆస్తులు లేవు. పదో తరగతి వరకు చదివి, కంప్యూటర్‌లో శిక్షణ పొందా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం లేదా, దళితబంధు ద్వారా ఆర్థికసాయం ఇప్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని