logo

పల్లె పాలన అస్తవ్యస్తం..

దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. అలాంటి పల్లెల్లో పాలన అందించే పంచాయతీ కార్యాలయాలకు గూడు కరవైంది. ఇప్పటికీ అద్దె భవనాలు, ఇళ్లల్లో, పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.

Published : 01 Apr 2023 01:41 IST

నిధులు  మంజూరైనా కార్యాలయాల నిర్మాణాల్లో జాప్యం
న్యూస్‌టుడే, మెదక్‌, చేగుంట, పాపన్నపేట, వెల్దుర్తి, అల్లాదుర్గం, కౌడిపల్లి, టేక్మాల్‌, కొల్చారం

రామంతాపూర్‌ తండాలో ఆరుబయట సమావేశం

దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. అలాంటి పల్లెల్లో పాలన అందించే పంచాయతీ కార్యాలయాలకు గూడు కరవైంది. ఇప్పటికీ అద్దె భవనాలు, ఇళ్లల్లో, పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆరుబయట, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సిన దుస్థితి. పలు చోట్ల భవనాలు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదు.

జిల్లాలోని 21 మండలాల్లో 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో 320 ఉండగా, కొత్తగా 157 పంచాయతీలు ఆవిర్భవించాయి. ఇది వరకు ఉన్న వాటికి సైతం సొంత భవనాలు కరవయ్యాయి. చాలా చోట్ల పాఠశాలల్లోని గదుల్లో సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సమావేశాల సమయంలో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

రూ.20 లక్షలతో..

జిల్లాలో 173 పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. వాటిలో 97 చోట్ల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధి హామీ, గిరిజన సంక్షేమ నిధులు ఇటీవల కేటాయించింది. రూ.20 లక్షలతో భవనాన్ని నిర్మించాలని ఆదేశాలిచ్చింది. మంజూరైన వాటిలో 21 పంచాయతీల భవనాలు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో కేవలం రెండింటిని మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 66 చోట్ల పనులు షురూ చేయాల్సి ఉంది.

ధరలు పెరగడంతో..

విపణిలో స్టీల్‌, సిమెంట్‌ ధరలు పెరగడం, మరో వైపు ఉపాధి హమీలో చేసిన పనులకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల విడుదలలో జాప్యం కారణంగా గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదు. టేక్మాల్‌లో 5, కౌడిపల్లిలో 9, ఉమ్మడి వెల్దుర్తి మండలంలో ఏడు పంచాయతీలకు నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. పలు చోట్ల స్థలాల ఎంపిక పూర్తికాలేదు. చేగుంట మండలం జెత్రం తండాలో ఏడాది కిందట శంకుస్థాపన చేసి వదిలేశారు.

దౌలాపూర్‌లో అద్దె భవనంలో..

పలు చోట్ల ఇలా..

హవేలిఘనపూర్‌ మండలంలో 8 గ్రామాలను ఏర్పాటుచేయగా అన్ని చోట్ల సామాజిక, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పాపన్నపేట మండలంలో కుర్తివాడలో వెలుగు సమాఖ్య, కొడుపాకలో వెటర్నరీ భవనం, దౌలాపూర్‌లో అద్దె ఇంట్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. కొల్చారం మండలం వెంకటాపూర్‌, వాసురాం, సీతారం తండాల్లో సర్కారు బడులే దిక్కయ్యాయి. మెదక్‌ మండలంలో ఐదు పంచాయతీలు సామాజిక భవనాల్లో, అల్లాదుర్గం మండలం సీతానగర్‌లో బడిలో కొనసాగుతోంది.


వేగిరం చేస్తాం

- సత్యనారాయణరెడ్డి, పీఆర్‌ ఈఈ

ఆర్థిక సంవత్సరం సమీపించడంతో ప్రభుత్వ ఆదేశాలతో సీసీ రోడ్ల నిర్మాణాలపై దృష్టి సారించాం. ఈనెల నుంచి గ్రామపంచాయతీ భవనాల పనులు వేగిరం చేస్తాం. కొన్ని చోట్ల గుత్తేదారులు ముందుకు రాలేదు. సమస్య పరిష్కరించి త్వరగా పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటాం.


కౌడిపల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉండగా కొత్తగా 12 ఏర్పాటయ్యాయి. ఉపాధిహామీ ద్వారా 9, గిరిజన సంక్షేమం ద్వారా ఐదు గ్రామపంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఎక్కడా పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. మండలంలోని కంచనపల్లి పంచాయతీ కార్యాలయం ప్రస్తుతం పెచ్చులూడుతున్నాయి. కొత్త నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు చేపట్టలేదు.


నార్సింగి మండలం భీంరావుపల్లిలో తొలి విడతలో కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరవగా గుత్తేదారుడు స్లాబ్‌ వరకు పనులు చేపట్టి వదిలేశాడు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో కార్యాలయం కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు పాట్లు పడుతున్నారు. రెండు గదుల్లో పాఠాలు చెప్పాల్సి ఉండగా ఒకే దాంట్లో సర్దుబాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని