కరవు ప్రాంతంలో జలకళ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్ అన్నారు.
హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్
సహకార సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తున్న టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం హుస్నాబాద్‌లోని వేడుక మందిరంలో జరిగిన సాగునీటి దినోత్సవ సంబురాలులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎక్కడ చూసిన ఎండిపోయిన చెరువులు, కుంటలు దర్శనమిచ్చేవన్నారు. నియోజకవర్గంలో 700కుపైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఈవన్నీ జలకళ ఉట్టిపడుతోందన్నారు. గౌరవెల్లి రిజర్వాయరు నిర్మాణం పూర్తి కావచ్చిందని, త్వరలోనే సీఎం కేసీఆర్‌తో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. కోహెడ మండలంలోని శనిగరం, సింగరాయ ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేయించి సాగునీరందిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ద్వారా ఎల్కతుర్తి, దేవాదుల ద్వారా భీమదేవరపల్లి మండలాలకు, మిడ్‌మానేరు నుంచి తోటపల్లి ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరు లభిస్తోందన్నారు. హనుమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ ఛైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, అదనపు పాలనాధికారి పి.శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ పురాధ్యక్షురాలు ఆకుల రజిత తదితరులు పాల్గొన్నారు. కోటి ఎకరాల మాగాణం, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం ప్రభుత్వ పుస్తకాలను శాసనసభ్యుడు, అధికారులు అవిష్కరించారు. సీనియర్ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఎవుసం, సురుకుల వైద్యం అనే పుస్తకాలను శాసనసభ్యుడు సతీశ్‌కుమార్, అదనపు పాలనాధికారి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అవిష్కరించారు.
సహకార రంగంలో గణనీయ అభివృద్ధి
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్‌టుడే: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సహకార రంగంలో గణనీయమైన అభివృది సాధించామని టెస్కాబ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. బుధవారం అక్కన్నపేట మండలం కట్కూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కల్సి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తెలంగాణ రాకముందు రాష్ట్ర సహకార బ్యాంకు రూ.6వేల కోట్లు, జిల్లా సహకార బ్యాంకులన్ని కలిపి రూ.6వేల కోట్ల చొప్పున వ్యాపారం చేయగా ఇప్పుడు అది రూ.20వేల కోట్లకు పెరిగిందన్నారు. మొత్తం రూ.40వేల కోట్ల వ్యాపారానికి పెరిగిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 ఏళ్లలో 281 గోదాములు నిర్మిస్తున్నామన్నారు. 62వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయవచ్చునన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంఘాలను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటైన అక్కన్నపేట మండలంలో అదనంగా మరో సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్‌కుమార్ శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, సర్పంచి జిల్లెల అశోక్‌రెడ్డి, సహకార సంఘం ఛైర్మన్ పంజ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.