logo

ఉద్యమ వేదిక.. చైతన్య గీతిక

రాష్ట్రానికి అభివృద్ధి నమూనా సిద్దిపేట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పురిటిగడ్డ. సాహితీ క్షేత్రం.. కళల కాణాచి.. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 20 సార్లు ఎన్నికలు జరిగాయి.

Updated : 26 Oct 2023 05:36 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేట పట్టణంలో కమాన్‌

రాష్ట్రానికి అభివృద్ధి నమూనా సిద్దిపేట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పురిటిగడ్డ. సాహితీ క్షేత్రం.. కళల కాణాచి.. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 20 సార్లు ఎన్నికలు జరిగాయి. రాజకీయ దురంధరుల గడ్డగా సిద్దిపేటకు ప్రత్యేక స్థానముంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. తొలి, మలి దశ స్వరాష్ట్ర సాధన ఉద్యమాల్లో కదం తొక్కిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2016 అక్టోబరు 11న జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది.

నియోజకవర్గానికి తూర్పున హుస్నాబాద్‌, పడమర దుబ్బాక, ఉత్తరాన రాజన్న సిరిసిల్ల, దక్షిణాన గజ్వేల్‌ నియోజకవర్గం ఉంది. తొలిసారి ఎడ్ల గురువారెడ్డి(పీడీఎఫ్‌), తర్వాత పీవీ రాజేశ్వరరావు (కాంగ్రెస్‌), సోమేశ్వర్‌రావు(స్వతంత్ర), వీబీ రాజు(కాంగ్రెస్‌) ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీబీ రాజు మంత్రిగానూ పనిచేశారు. అనంతుల మదన్‌మోహన్‌ 1970లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగానూ తనదైన ముద్ర వేశారు. కేసీఆర్‌ సిద్దిపేట నుంచి ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో మొదటిసారి డబుల్‌ హ్యాట్రిక్‌కు నాంది పలికారు. నాలుగుసార్లు తెదేపా నుంచి, రెండుసార్లు తెరాస నుంచి గెలుపొంది ప్రత్యేకత చాటారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి, ఉపసభాపతిగా వ్యవహరించారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తొలిసారిగా 2004 ఉప ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచి విజయం సాధించిన ఆయన ఇక్కణ్నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు.

అయిదుసార్లు ఉప ఎన్నికలు..

ఇప్పటి వరకు అయిదుసార్లు ఉప ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 1970, 2001, 2008, 2010లో జరిగాయి. 2004లో కేసీఆర్‌ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. దీంతో ఆయన సిద్దిపేట స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గానికి మానేరు మంచినీటి పథకాన్ని సాధించారు. దాని స్ఫూర్తితో రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకానికి అంకుర్పారణ జరిగింది.

కళలు, సాహిత్యంలో ప్రసిద్ధులు..

సిద్దిపేట కళలకు కాణాచి. చిత్రకళా రంగంలో దివంగత డా.కాపు రాజయ్య అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారు. బాతిక్‌ చిత్రకళతో దివంగత యాసాల బాలయ్య కళాభిమానుల మనసును దోచుకున్నారు. కవులుగా వేముగంటి నర్సింహాచార్యులు, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఐతా చంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి ప్రసిద్ధులు. దివంగత గుమ్మనగారి లక్ష్మీనర్సింహశర్మ అష్టావధానంలో ఘనాపాటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని