logo

కండక్టర్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా

నర్సాపూర్‌ భాజపా అభ్యర్థి మురళీయాదవ్‌ గతంలో ఆర్టీసీలో బస్‌కండక్టర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం కమ్యూనిస్టు నేత చిలుము విఠల్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Published : 11 Nov 2023 04:09 IST

నర్సాపూర్‌ భాజపా అభ్యర్థి మురళీయాదవ్‌ గతంలో ఆర్టీసీలో బస్‌కండక్టర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం కమ్యూనిస్టు నేత చిలుము విఠల్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో సీపీఐ, ఆ తర్వాత తెదేపా, భారాస, ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్నారు. నర్సాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచిగా 1995-2000 వరకు కొనసాగారు. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రెండోసారి 2000-2005 వరకు సర్పంచిగా కొనసాగారు. 2014-2019 వరకు భారాస ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవిని సైతం నిర్వహించారు. ప్రస్తుతం 2020లో నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. 2022లో భాజపాలో చేరారు. అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించగా పోటీకి నిలిచారు.

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


కొల్చారం మండలం..  మహిళా ఓటర్లే అధికం

కొల్చారం మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 21 గ్రామాల్లో మొత్తం ఓటర్లు 26,107 మంది ఉండగా, పురుషులు 12,552, మహిళలు 13,554 మంది ఉన్నారు. గ్రామాల వారీగా చూస్తే రంగంపేటలో అత్యధికంగా 2,664 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటాపూర్‌లో అతి తక్కువగా 416 మందే ఉన్నారు. వెంకటాపూర్‌లో మరో ప్రత్యేకత  ఏమిటంటే మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, ఇక్కడ పురుషులు అధికంగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డికి ఆధిక్యం లభించగా, 2018లో మాత్రం తెరాస అభ్యర్థి మదన్‌రెడ్డికి ఆధిక్యం అభించింది. గతంలో ప్రత్యర్థులు ఇద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.

న్యూస్‌టుడే, కొల్చారం


సంపాదనకు..  ఇదే మంచి తరుణం

మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో పాటు బుజ్జగింపులు, డబ్బుల పంపిణీ, మద్యం సరఫరా, మాంసంతో విందులు గల్లీగల్లీలో జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన రెండో శ్రేణి నాయకులు చాలా మంది డబ్బు సంపాదనకు ఇదే మంచి తరుణం అన్నట్లుగా పోటీలు పడి ఓటు ఉన్నవారిని, లేనివారిని తీసుకెళ్లి అభ్యర్థుల సమక్షంలో చేర్పిస్తున్నారు. ఓ నాయకుడు పది మందిని తీసుకెళ్లి అభ్యర్థితో కండువాలు కప్పించగానే మరో నాయకుడు పోటీపడి అంతకుమించి తీసుకెళ్లి కండువాలు వేయిస్తున్నాడు. దీంతో పాటు కొత్తగా చేరిన వారికి విందు ఇవ్వాలని అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకుని, ఎంత ఇచ్చారో తెలుపకుండా మద్యంతో సరిపెడుతున్నారు. కొంతమంది ఇదే తరుణం అని అలకపాన్పు ఎక్కుతున్నారు. అభ్యర్థి స్వయంగా ఇంటికి రావడమో లేదా పిలిపించుకోవడమో చేస్తారని తద్వారా అధికంగా డబ్బులు అందుతాయని భావిస్తున్నారు.

న్యూస్‌టుడే, వెల్దుర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని