logo

అసెంబ్లీ బాట పట్టారిలా..

నారాయణఖేడ్‌ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 150 కి.మీ., జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 90 కి.మీ.ల దూరంలో ఉంటుంది.

Published : 15 Nov 2023 02:02 IST

అయిదుగురు ఖేడ్‌ ఎమ్మెల్యేలు న్యాయవాదులే..

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 150 కి.మీ., జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 90 కి.మీ.ల దూరంలో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దున ఉన్న ప్రాంతమిది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే విద్యతోపాటు అన్నిరంగాల్లోనూ వెనుకబడి ఉంది. ఖేడ్‌ అసెంబ్లీ స్థానానికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది మంది శాసనసభ్యులుగా పనిచేశారు. వారిలో అయిదుగురు న్యాయవాద కోర్సును పూర్తిచేసి.. న్యాయవాదులుగా పనిచేసిన వారే కావడం విశేషం. వారే అప్పారావు శెట్కార్‌, శివురావు శెట్కార్‌, రాంచందర్‌రావు దేశ్‌పాండే, కిష్టారెడ్డి, విజయపాల్‌రెడ్డి.

ఎమ్మెల్యేల ప్రస్థానం..

  • 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో అప్పారావు శెట్కార్‌ గెలుపొందారు. 1962 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
  • 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాంచందర్‌రావు దేశ్‌పాండే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967 వరకు కొనసాగారు. పదవీకాలం పూర్తికాక ముందే గోవధ నిషేధాన్ని డిమాండ్‌ చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
  • 1967లో జరిగిన ఎన్నికల్లో శివురావు శెట్కార్‌ శాసనసభ్యుడిగా ఎన్నికై 1972 వరకు కొనసాగారు. తిరిగి 1978, 1985(మధ్యంతర) ఎన్నికల్లో విజయం సాధించారు.
  • పట్లోళ్ల కిష్టారెడ్డి 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి 1994 వరకు కొనసాగారు. 1999, 2009, 2014లోనూ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015 ఆగస్టులో పదవిలో ఉండగానే ఆకస్మికంగా మృతిచెందారు.
  • మహారెడ్డి విజయపాల్‌రెడ్డి 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు.

తొలి ముగ్గురు వారే..

ఖేడ్‌ అసెంబ్లీ స్థానానికి 1952 నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి ముగ్గురు ఎమ్మెల్యేలు న్యాయవాద కోర్సును పూర్తి చేసి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అప్పారావు శెట్కార్‌ రెండు పర్యాయాలు, శివురావు శెట్కార్‌ మూడు సార్లు, రాంచందర్‌రావు దేశ్‌పాండే, విజయపాల్‌రెడ్డి ఒక్కో పర్యాయం ఎమ్మెల్యేలుగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని