logo

Harish Rao: కేసీఆర్‌కు పనితనం తప్ప.. పగతనం తెలియదు: హరీశ్‌రావు

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. పనితప్ప పగతనం తెలియని నాయకుడని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 13 Dec 2023 17:52 IST

నర్సాపూర్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. పనితప్ప పగతనం తెలియని నాయకుడని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారాస కృతజ్ఞత సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారాస ప్రభుత్వం వచ్చాక హౌసింగ్‌ స్కామ్‌లో కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్‌ నేతలు జైల్లో ఉండేవాళ్లని ఆరోపించారు. సాధించిన తెలంగాణలో కక్షలతో, పగలతో ఇబ్బంది పడకూడదని కేసీఆర్‌ పనిమీద దృష్టి పెట్టారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసి.. ప్రజల కోసం పనిచేశామన్నారు.

రాజకీయాల్లో గెలుపు.. ఓటములు సహజమని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామన్నారు. రాబోయే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం వైపు అడుగులు వేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించాం... అపజయాలను కూడా చూశామన్నారు. విజయాలు సాధించినప్పుడు విర్రవీగలేదు.. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదని పేర్కొన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేశామని గుర్తు చేశారు.

ఇది ఒక చిన్న స్పీడ్‌ బ్రేకర్‌..

‘‘నర్సాపూర్‌లో గెలిచిన పార్టీ రాష్ట్రంలో గెలవలేదనే బాధ ఉంది. తాత్కాలికంగా వేగం తగ్గొచ్చుకానీ.. అంతిమంగా గమ్యం చేరేది భారాసనే. ఇది ఒక చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే. అద్భుతమైన భవిష్యత్తు ఉండేది భారాస పార్టీకే. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని అధికార పార్టీ వాళ్లు చూస్తారు. ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దు. నర్సాపూర్‌ భారాసకు కంచుకోట అని నిరూపించారు. నర్సాపూర్‌లో హ్యాట్రిక్‌ కొట్టడం సంతోషంగా ఉంది’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని