logo

సంపాదనలో పేదలకు 2.5 శాతం

పవిత్ర రంజాన్‌ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో,

Published : 29 Mar 2024 02:57 IST

జకాత్‌ పేరిట దానధర్మాలు
న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌, వెల్దుర్తి

జహీరాబాద్‌లో సరకులు అందజేస్తూ..

విత్ర రంజాన్‌ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, జకాత్‌, ఫిత్రా పేరిట దానధర్మాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రక్రియకు తెరతీశాయి.

సంపాదనలో పేదల హక్కు..: ఎవరి వద్ద అయితే 6 తులాల బంగారం లేక 52.5 తులాల వెండి ఆభరణాలు లేదా అంతే సమానమైన నగదు ఉంటే వారంతా జకాత్‌కు అర్హులు. మన వద్ద ఉన్న సొమ్మును లెక్కించి అందులో 2.5 శాతం మేర దానం చేయాలి. జకాత్‌ ఏడాదిలో ఎప్పుడైనా ఇవ్వొచ్చు. రంజాన్‌ మాసంలో ఇస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది. ఈ నెలలో ఫిత్రా రూపంలో దానధర్మాలు చేస్తుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరి పేరిట 1.250 కిలోల గోధుమలు లేదా అంతే సమానమైన డబ్బు పేదలకు దానమివ్వాలి. తీసుకునే వారు మాత్రం నిరుపేదలై ఉండాలనే నిబంధన విధిగా పాటించాలని మహ్మద్‌ ప్రవక్త సూచించారు.

పంపిణీకి సిద్ధం చేసిన నిత్యావసరాలు

పింఛన్లు, ఉపాధికి సహకారం: జహీరాబాద్‌లో రెండు దశాబ్దాలుగా సఫా బైతుల్‌ మాల్‌ స్వచ్ఛ సంస్థ పేదల సేవలో తరిస్తోంది. రంజాన్‌ మాసంలో రేషన్‌ కిట్లు, దుస్తుల పంపిణీ చేపడుతోంది. ఏటా 300 మంది వరకు అందజేస్తున్నారు. మరోవైపు పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయంతో పాటు భోజన సౌకర్యం కల్పిస్తోంది. ప్రతి నెలా ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తోంది. నిరుద్యోగ యువతులకు కుట్లు, అల్లికలు, కంప్యూటర్‌లో ఉచిత శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తోంది. వేసవిలో చలివేంద్రాలు, నామ మాత్రపు రుసుముతో అంబులెన్స్‌ సేవలతో అపన్నహస్తం అందిస్తుండటం గమనార్హం.


స్తోమత ఉన్నవారంతా ఇవ్వాలి
మహ్మద్‌ ఇస్మాయిల్‌, ఇమాం, వెల్దుర్తి

జకాత్‌ అనేది ఆర్థిక స్తోమత ఉన్న వారికి నిర్దేశించినది. సొంతంగా సంపాదించిన దాని నుంచే దానం చేయాలి. రుణగ్రస్తులైతే ఇందుకు అర్హులు కారు. వర్షాధారంగా పండే ఫలాలు, ధాన్యంపై పదో వంతు, బావులు, బోర్ల ఆధారంగా పండే వాటిపై అయిదో వంతు జకాత్‌ ఇవ్వాలి. తమ వారికి కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని