logo

త్రిముఖ పోరు.. పాగా వేసేదెవరు?

గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్‌ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి

Published : 17 Apr 2024 03:13 IST

జహీరాబాద్‌ పరిధిలో ప్రధాన పార్టీల ముమ్మర యత్నం

 ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్‌ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్‌(సురేష్‌ షెట్కార్‌), 2014, 2019లో తెరాస(బీబీపాటిల్‌) అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున సురేష్‌ కుమార్‌ షెట్కార్‌, భాజపా నుంచి బీబీ పాటిల్‌, భారాస అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు ఎవరికివారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తుండటంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎటువైపు మొగ్గుతారో..: 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఎల్లారెడ్డి స్థానంలో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని నాలుగు స్థానాల్లో భారాస, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో ఫలితాల అనంతరం తేలనుంది.

మండల స్థాయిలో సమావేశాలు: జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో 2009, 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాసల మధ్యనే పోరు సాగింది. ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొంది. భారాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే మండల, నియోజకవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. నామపత్రాల దాఖలుకు మూడు పార్టీల అభ్యర్థులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తదనంతరం ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని