logo

ఉక్కపోత.. బిల్లుల మోత

 జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి.

Updated : 18 Apr 2024 06:08 IST

 వేసవిలో పెరుగుతున్న విద్యుత్తు వినియోగం

 మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. అందుకు కారణం ఏసీలు, ఫ్యాన్ల వాడకం భారీగా పెరగడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఉక్కపోత కారణంగా రాత్రివేళ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాల వృద్ధితో జీవన ప్రమాణాలు పెరగడంతో ఆ మేరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం పెరిగింది. అదే స్థాయిలో కరెంట్‌ బిల్లులు వస్తున్నాయి. జిల్లా పరిధిలో మెదక్‌, తూప్రాన్‌ రెండు డివిజన్లు ఉండగా వాటి పరిధిలో మొత్తం 2,04,945 గృహాలకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా మార్చి నెలలో రూ.4.87 కోట్ల విలువైన బిల్లులు జారీ అయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద 1,08,581 మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుండగా వాటి విలువ రూ.2.66 కోట్లు రాయితీ రూపంలో ప్రభుత్వం విద్యుత్తు శాఖకు చెల్లిస్తుంది.

 లోటు లేకుండా సరఫరా...

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతులు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యుత్తు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగినా మార్చి నెలలో కోతలు, అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసింది. దీంతో మార్చి నెల 5వ తేదీన రికార్డు స్థాయిలో 10.77 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది.

పొదుపు చర్యలతో....

అధికంగా బిల్లులు వస్తున్న గృహ వినియోగదారుల జీవనశైలిని గమనిస్తే వృథా కూడా అధికంగానే ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరం లేకపోయినా అన్ని గదుల్లో విద్యుత్తు దీపాలను వేయడం, గదుల్లో ఎవరూ లేకపోయిన ఫ్యాన్లు తిరుగుతుండటంతో విద్యుత్తు ఖర్చు అధికమవుతోంది. అవసరం ఉన్నప్పుడే దీపాలు, ఫ్యాన్లు తదితర వస్తువులను ఉపయోగించుకోవడం, స్మార్ట్‌ స్విచ్‌లను ఏర్పాటు చేసుకోవడం, 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన వస్తువులను మాత్రమే ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తును పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు.


నిరంతరాయంగా సరఫరా చేస్తాం
- జానకిరాములు, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ మెదక్‌ సర్కిల్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు నిరంతరంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని విధులు నిర్వహిస్తున్నాం. మార్చి నెలలతో పోల్చుకుంటే ఏప్రిల్‌లో వ్యవసాయ బోర్ల వాడకం తగ్గుతుండడంతో అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం సైతం తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని