logo

పడిలేచిన కెరటం.. అర్పిత

అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది

Updated : 18 Apr 2024 06:16 IST

మూడుసార్లు విఫలమైనా సడలని సంకల్పం

సివిల్స్‌లో జాతీయస్థాయిలో మెరిసిన యువతి

న్యూస్‌టుడే, తూప్రాన్‌: అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. మంగళవారం వెలువడిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో జాతీయస్థాయిలో 639 ర్యాంకు సాధించిన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం నర్సంపల్లి పంచాయతీ పరిధి లింబ్యాతండాకు చెందిన కోలా అర్పిత విజయగాథపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

చదువుకునే సమయంలోనే..

లింబ్యాతండాకు చెందిన కోలా అమర్‌సింగ్‌, రేణుక దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి రేణుక సంగారెడ్డి జిల్లా సదాశివపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. వీరు హైదరాబాద్‌లోని బొల్లారంలో నివాసం ఉంటున్నారు. అక్కడే అర్పిత పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసింది. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో 2019లో బీటెక్‌ పూర్తి చేసింది. బీటెక్‌ చదువుతున్న సమయంలో రెండేళ్ల పాటు ప్రతి శనివారం, ఆదివారం అనాథ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పింది. ఈ సమయంలోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించి పేద విద్యార్థులకు మరింత సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో బీటెక్‌ పూర్తికాగానే దిల్లీలో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు వెళ్లింది. 9 నెలల పాటు శిక్షణ పొందింది. అనంతరం ఇంట్లోనే చదువుతూ 2021లో తొలిసారి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయగా ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. 2022లో మెయిన్స్‌లో విఫలం కాగా.. 2023లో మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి విజయం సాధించలేకపోయింది. అయినా పట్టువీడకుండా ఇంట్లోనే సన్నద్ధమై నాలుగోసారి తాజా ఫలితాల్లో 639 ర్యాంకు సాధించింది.  

అమెరికా వద్దనుకొని..

ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే అర్పితను అమెరికా పంపాలని కుటుంబసభ్యులు భావించారు. అనాథ పిల్లల జీవితాలను స్వయంగా చూసిన అర్పిత.. అమెరికా వెళ్లాలనే ఆలోచనకు స్వస్తి పలికింది. సివిల్స్‌లో విజయం సాధిస్తే అనాథలతో పాటు పేదలకు సేవ చేయవచ్చని ఐదేళ్లు కష్టపడి విజయం సాధించింది. ఇందుకు తల్లిదండ్రులు సైతం వెన్నంటి ప్రోత్సహించడంతో లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలీకృతమైంది.

తాత పేరుతోనే తండా

అర్పిత తాత లింబ్యా నర్సంపల్లి గ్రామ మొదటి సర్పంచిగా పనిచేశారు. ఈయన పేరు మీదుగానే లింబ్యాతండా అని పేరు వచ్చింది. సివిల్స్‌లో సత్తా చాటడంతో అర్పితతో పాటు తాత లింబ్యా పేరు సైతం జాతీయ స్థాయిలో మారుమోగుతోందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఏఎస్‌ సాధించడమే ధ్యేయం: అర్పిత

తల్లిదండ్రుల ప్రోత్సాహంలో సివిల్స్‌లో విజయం సాధించాను. అనాథ పిల్లలకు చదువు చెప్పే సమయంలోనే వారి బతుకులు చూసి ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నాను. ఈ ర్యాంకుతో ఐఏఎస్‌ రాకపోయినా, ఐపీఎస్‌ 100శాతం వస్తుందనే నమ్మకం ఉంది. ఐఏఎస్‌ రాకపోతే మరోసారి పరీక్ష రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేస్తాను.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని