logo

వంతెన ఇరుకు రాకపోకలకు బెరుకు

సాగర్‌ ఎడమ కాల్వపై అత్యంత ప్రమాదకరంగా, ఇరుకుగా ఉన్న వంతెనల పునర్నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏటా అధికారులు అంచనాలు వేసి పంపించడం.. అవి కార్యాలయాల్లోనే మిగిలిపోవడం షరామాములుగా మారింది. వాహనదారులు

Published : 19 May 2022 02:49 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే

మర్రికుంట వద్ద ప్రమాదకరంగా వంతెన

సాగర్‌ ఎడమ కాల్వపై అత్యంత ప్రమాదకరంగా, ఇరుకుగా ఉన్న వంతెనల పునర్నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏటా అధికారులు అంచనాలు వేసి పంపించడం.. అవి కార్యాలయాల్లోనే మిగిలిపోవడం షరామాములుగా మారింది. వాహనదారులు, స్థానికులకు మాత్రం ఇబ్బందుల నుంచి విముక్తి కలగడంలేదు. జాతీయ రహదారుల నుంచి రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న సూర్యాపేట- గరిడేపల్లి రహదారిలోని ఈ దుస్థితి. కాల్వపై రెండు వంతెనలు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మర్రికుంట గ్రామం వద్ద (93.080 కి.మీ), మరొకటి కుతుబ్‌షాపురం సమీపంలో(95.010 కి.మీ) ఉన్నాయి. గతంలో మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి కొత్త వంతెనల కోసం నిధులు మంజూరుచేస్తామని పలు మార్లు హామీ ఇచ్చారు. ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా.. కార్యరూపం దాల్చలేదు. మర్రికుంట వంతెన మలుపుల వద్ద ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌- విజయవాడ, జనగాం-సూర్యాపేట- ఖమ్మం, తానంచర్ల-రేణిగుంట, తదితర జాతీయ రహదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానిస్తున్న నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్రీయ రహదారికి గరిడేపల్లి-సూర్యాపేట రెండు వరుసల దారి అనుసంధానంగా ఉంది. దగ్గరి దారి కావడంతో లారీలు, భారీ వాహనాల తాకిడి అధికంగా ఉంటుంది. దీనికి తొడు ఆర్టీసీ బస్సులు, సాదారణ వాహనాలు రద్దీ సైతం ఉంటుంది. మర్రికుంట మలుపు ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లాలంటే ప్రధాన దారి ఇదే. బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల ప్రజలు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు, ఎస్పీ ఆఫీస్‌ తదితర జిల్లా కార్యాలయాలకు రావాలంటే ఈ దారి గుండానే ప్రయాణించాలి. ఇంతా ప్రాధాన్యత ఉన్నా.. వంతెనలను మరమ్మతులు చేయటంతో శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రహదారిని ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తుండగా, కాల్వలను ఎన్నెస్పీ చూస్తోంది. దీంతో ఆర్‌అండ్‌బీ వంతెనల అభివృద్ధిని పట్టించుకోవటం లేదు. ఎన్నెస్పీ అధికారుల ప్రతిపాదనలను ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. గతంలో ఓసారి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించినా నిధులు రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడి చొరవ తీసుకుని ప్రతిపాదనలు పంపించాలని నిధుల లభ్యతను బట్టి ఏదో ఒక శాఖ నుంచి మంజూరుకి ప్రయత్నించాలని సంకల్పించి ఎన్‌ఎస్‌పీˆ అధికారులకు సూచించారు. మరోసారి మర్రికుంట వంతెనకు రూ.2.50 కోట్లకు, కుతుబ్‌షాపురం వంతెనకు రూ.1.60 కోట్లతో పునర్నిర్మించాలని ఎన్‌ఎస్‌పీˆ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కుతుబ్‌షాపురం వద్ద..

ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి
- రఘు, డీఈఈ, ఎన్నెస్పీ ప్రధాన కాల్వ

మర్రికుంట వంతెనకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మా శాఖ నుంచి మర్రికుంట, కుతుబ్‌షాపురం వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. రోడ్డు విస్తరించినందున అదే తరహాలో వంతెన నిర్మాణానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తాం. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని