logo

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని బలవన్మరణం

తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థిని కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో సోమవారం జరిగింది.

Published : 29 Nov 2022 06:13 IST

మఠంపల్లి, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థిని కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో సోమవారం జరిగింది. ఎస్సై ఇరుగు రవి తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్‌ తండాకు చెందిన ధరావత్‌ సైదులు, అరుణ దంపతుల కూతురు డి.వేదశ్రీ(15) ఇక్కడి ఎన్‌సీఎల్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. మార్కులు తక్కువ వస్తున్నాయంటూ తల్లిదండ్రులు ఆదివారం రాత్రి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉదయం పాఠశాలకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి నేరుగా కృష్ణానది వద్దకు చేరుకుంది. అక్కడ పుస్తకాల సంచి, గుర్తింపు కార్డు వదిలి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వేదశ్రీ పాఠశాలకు రాని విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులతో కలిసి వెతుకుతున్న క్రమంలో నది వద్ద పుస్తకాల సంచి కన్పించడంతో నీటిలో దూకి ఉంటుందన్న అనుమానంతో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికే బాలిక మృతదేహం లభించడంతో కన్నీరు మున్నీరయ్యారు. క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుని మాకు తీరని వేదన మిగిల్చావమ్మా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని మరణానంతర పరీక్షకు పంపి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని