logo

నిధులిచ్చినా.. నీరసమే..!

నల్గొండలో ప్రారంభమైన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల పట్ల కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

Published : 04 Dec 2022 05:00 IST

సైన్స్‌ఫేర్‌ను తిలకిస్తున్న విద్యార్థులు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నల్గొండలో ప్రారంభమైన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల పట్ల కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసక్తి చూపలేదు. గతంతో పోలిస్తే  ఈ సారి తక్కువ ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈసారి జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌తో పాటే ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డుల ప్రదర్శన చేపట్టారు. రెండు ప్రదర్శనలకు కలిపి మొత్తం 402 ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో 328 ప్రదర్శనలు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్‌ ప్రదర్శినలు కాగా.. 74 ప్రదర్శనలు ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులకు సంబంధించినవి. వాస్తవానికి ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులు కింద జిల్లాలో 92 ప్రాజెక్టులు ప్రదర్శించాల్సి ఉంది. ఒకో ప్రాజెక్టుకు రూ.10వేలు చొప్పున కేంద్రప్రభుత్వం మంజూరి చేసింది. ప్రదర్శనలో ఎక్కువశాతం ప్రాజెక్టులు వెయ్యిలోపు ఖర్చుకూడా పెట్టలేదు. మంజూరైన 92 ప్రాజెక్టుల్లో 18 ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రాజెక్టులకు సంబంధించి విద్యార్థులు పాల్గొనలేదు. వచ్చిన వాటిలో కొంత మంది అక్కడ తమ పాజెక్టు పేరుతో ఉన్న పోస్టర్‌ పెట్టేసి వెళ్లిపోయారు. కొన్ని పాఠశాలల నుంచి ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రాజెక్టుకు ఎంపికైన విద్యార్థులు కాకుండా వారి పేరుమీద వేరే విద్యార్థులు సైతం పాల్గొన్నారు. నిధులు మంజూరు చేసి ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో డ్రిల్‌హోల్స్‌, కొడిగుడ్డు పొట్టుతో చాక్‌పీస్‌ తయారీ, హ్యాండ్‌మేడ్‌, పాస్‌వర్డు సేఫ్‌ లాకర్‌, వాటర్‌ అలారం, ఎమర్జెన్సీ టాయిలెట్‌, స్మార్టుఫోన్‌ ప్రొజెక్టర్‌, పెన్సిల్‌ లెడ్‌ సహాయంతో ఎమెర్జెన్సీ లైట్‌ వెలిగించడం, కలర్‌ కోడెడ్‌ థర్మామీటర్‌ ఇలా తక్కువ ఖర్చు పెట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇక ప్రైవేట్‌ పాఠశాలల భాగస్వామ్యం కూడా బాగా తక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని