సంక్షేమమే హద్దుగా..పద్దు !
వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పునాది రాయి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఈనాడు, నల్గొండ, నల్గొండ టౌన్, న్యూస్‌టుడే: వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పునాది రాయి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో బుధవారం పద్దును ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో పాటూ, యాంత్రీకరణకు ఈ బడ్జెట్ ప్రోత్సాహకాలు ఇచ్చింది. గతంతో పోలిస్తే రైతులకు రుణ వితరణను పెంచారు. సహకార వ్యవస్థలో ఉన్న సంఘాలను కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. వేతన జీవులకు ఈ బడ్జెట్‌లో విత్త మంత్రి ఊరటనిచ్చారు.
వేతన జీవికి..ఆదా
వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి ఈ దఫా బడ్జెట్‌లో కీలక మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి ప్రస్తుతం రూ.5 లక్షల వరకు గల రిబేట్‌ను తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 9 వేల మంది వేతన జీవులకు లబ్ధి చేకూరనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
* సీనియర్ సిటిజన్లకు సైతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షల గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ప్రస్తుతం ఈ స్కీమ్‌లో ఉన్న సుమారు లక్షన్నర మంది వరకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిసింది.
* యువత కోసం పంచాయతీ, వార్డుల స్థాయిల్లో ఫిజికల్ గ్రంథాలయాల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ, తుంగతుర్తి, ఆలేరు, నకిరేకల్ లాంటి నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతీ పంచాయతీలో గ్రంథాలయాలు అందుబాటులో ఉండనున్నాయి.
* దేశంలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లకు రూ.6835 కోట్లు కేటాయించడంతో ఇందులో కొన్ని నిధులు బీబీనగర్ ఎయిమ్స్‌కు దక్కనున్నాయి. గతేడాది రూ.1028 కోట్లు కేటాయించగా...ఈ నిధులతోనే ప్రస్తుతం అక్కడ పనులు సాగుతున్నాయి.
కిసాన్‌కు.. సమ్మాన్ నిధి
కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎంత పెంచనున్నారనే దానిపై ప్రకటన చేయకున్నా.. ప్రస్తుతం ఐదెకరాల లోపున్న రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేలను ఇస్తున్నారు. ఇది రూ.8 వేలకు పెంచనున్నారని తెలిసింది. ఈ పెంపుతో మూడు జిల్లాల్లో 4.38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత సర్వర్ మొరాయించడంతో ఉమ్మడి జిల్లాలో చాలామంది రైతులు ఈ పథకానికి అర్హులు కాలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షల మంది రైతులకు రైతుబంధు అందిస్తుండగా..కిసాన్ సమ్మాన్ నిధి మాత్రం ఇందులో సగం మందికి సైతం అందకపోవడం గమనార్హం.
అన్నదాత ‘రుణం’తీర్చుకునేలా..
వ్యవసాయ వితరణ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచనున్నారు. దీంతో ప్రస్తుతం మూడు జిల్లాలకు కలిపి సుమారు 10 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లకు పైగా లీడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రుణాలిస్తుండగా...ఇవి మరింతగా పెరగనున్నాయి. రైతు పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన బాధ తప్పనుంది. అయితే గత ఐదారేళ్లుగా బ్యాంకులు ఆర్భాటంగా పెద్ద మొత్తాలను లక్ష్యంగా పెట్టుకుంటున్నా..పూర్తి స్థాయిలో రైతులకు మాత్రం రుణాలు అందడం లేదు.
ఆన్‌లైన్‌లోకి.. సహకారం
చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంబిస్తున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించారు. దీని కోసం దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక సహకార పరపతి సంఘా (పీఏసీఎస్ - ప్యాక్స్)లను కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.2516 కోట్లు కేటాయించగా..ఉమ్మడి జిల్లాలోని పలు ప్యాక్స్‌లకు లబ్ధి చేకూరనుంది.
‘ఉపాధి’కి కోత
బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (నరేగా) నిధులు తగ్గించారు. గతేడాది రూ.93 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించగా.. ఈ దఫా రూ.20 వేల కోట్లు తగ్గిస్తూ రూ.73 వేలకు పరిమితం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక మంది ఉపాధి కూలీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నారని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక గణాంకాల నివేదిక అట్లాస్ వెల్లడించింది. దీంతో ఈ దఫా చాలా మందికి ఉపాధి రోజులు తగ్గనున్నాయి.
మదుపు వైపు.. మహిళలు
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ రానుంది. గరిష్ఠంగా రూ.రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.
కేంద్ర బడ్జెట్‌పై అభిప్రాయాలు ఇలా..
రాష్ట్రానికి అన్యాయం
- నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి
తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. వారు ‘ఈనాడు’తో బడ్జెట్ అనంతరం మాట్లాడారు. బడ్జెట్‌లో కేంద్రం ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్క పైసా కేటాయించలేదని మండిపడ్డారు. బడ్జెట్ కార్పొరేట్‌లకు మాత్రమే అనుకూలంగా ఉందని ఆక్షేపించారు. పునర్విభజన హామీలతో పాటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాజెక్టులకు నిధులివ్వకపోవడం శోచనీయమన్నారు.
మోసపూరిత బడ్జెట్ - బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ రాజ్యసభ
కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఉత్త డొల్లగా ఉంది. విభజన హామీల ఊసేలేదు. ఇది పూర్తిగా మోసపూరిత బడ్జెట్. దేశంలో 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో రైతులకు ఏ రాయితీలు ప్రకటించలేదు. కాళేశ్వరంతో పాటూ రాష్ట్రంలోనూ, ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాజెక్టుకూ నిధులు కేటాయించలేదు.
అన్ని వర్గాలకు ఉపయోగకరం -అంజిరెడ్డి, ఎంజీయూ అధ్యాపకులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనుండడం శుభపరిణామం. ఫార్మారంగ అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం రూపొందించడం మంచి పరిణామం. శ్రీఅన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులకు ప్రోత్సాహం అందించడం మంచి నిర్ణయాలు.
మౌలిక వసతుల కల్పనకు నిధులు
- ఆకుల రవి, ఎంజీయూ అధ్యాపకుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రవాణా, మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో రోడ్డు మార్గాలతో పాటు రైల్వే రంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు.ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు తగ్గనుండడం శుభపరిణామం. బంగారు ధరలు పెరగనుండడం కొంత ఇబ్బందికరమే. వ్యవసాయ అవసరాలకు, రైతు శ్రేయస్సు కోసం రూ.1.25 లక్షల కోట్లు కేటాయించడం అభినందనీయం. విద్య, వైద రంగాలకు బడ్జెట్‌లో స్వల్ప పెంపు కనిపిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది: వైవీ సుబ్బారెడ్డి
-
World News
ISI: పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ రెండో ర్యాంక్ స్థాయి అధికారి హతం..!
-
India News
Amritpal Singh: 45 నిమిషాలు గురుద్వారాలో ఉండి.. పూజారి ఫోన్ వాడి..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి