logo

దేవతల గని.. దేవరపెట్టె

తెలంగాణలో పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్రధాన క్రతువు అమ్మవార్లను గద్దెలపైకి చేర్చడం. కుంకుమభరణి రూపంలో అమ్మవార్లు గద్దెలపైన కొలువు దీరితేనే మేడారం జాతర మొదలవుతుంది.

Updated : 05 Feb 2023 06:29 IST

లింగమంతులస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన దేవరపెట్టె

చివ్వెంల, న్యూస్‌టుడే: తెలంగాణలో పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్రధాన క్రతువు అమ్మవార్లను గద్దెలపైకి చేర్చడం. కుంకుమభరణి రూపంలో అమ్మవార్లు గద్దెలపైన కొలువు దీరితేనే మేడారం జాతర మొదలవుతుంది. ఆ తర్వాత రెండోదిగా గుర్తింపు పొందిన దురాజ్‌పల్లి పెద్ద(గొల్ల)గట్టు లింగమంతులస్వామి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దేవర(అందనపు చౌడమ్మ)పెట్టె. దేవరపెట్టె పెద్దగట్టుకు చేరితేనే దిష్టిపూజ, జాతర ఆరంభమవుతుంది. దేవరపెట్టెను తిరిగి తీసుకెళ్తేనే జాతర ముగుస్తుంది. దీన్ని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం చీకటాయపాలెం నుంచి తండు వంశస్థులు బైకాన్లు సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామానికి తీసుకొస్తారు. ఇందులో 33 మంది దేవతామూర్తులున్న ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఈ దేవరపెట్టెకు మొదటగా సంప్రదాయం ప్రకారం కేసారంలో పూజలు చేసిన అనంతరం పెద్దగట్టుకు తీసుకురావడంతో జాతర మొదలైనట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత భక్తులు పూజలు చేస్తారు. దేవరపెట్టెను తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఆ పెట్టెను తాకి కళ్లకద్దుకునేందుకు పోటీపడే భక్తుల హంగామా చూడాల్సిందే.

ప్రత్యేకత ఏమిటంటే?

దేవరపెట్టెలో శ్రీలింగమంతులస్వామి, చౌడమ్మ, మాణిక్యమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, గంగాభవాని, విష్ణువు, కృష్ణుడు, వసుదేవుడు, దేవకి, వినాయకుడు, బ్రహ్మ, భైరవుడు, పాపనాచి, పల్లకి, నారదుడు, నంది, ఆవు, పులి, నాగశేషు, వరాహావతారం, ఐదు గుర్రాలపై చెంచులు, ఐదు గుర్రాలపై రాజులు, గొల్లభామలతో కూడిన దేవతామూర్తులు ఉంటారు. జాతరను ప్రారంభించే క్రతువులో భాగంగా దేవతామూర్తులను పెద్దగట్టుపైన శ్రీలింగమంతుల స్వామి ఆలయం ఎదుట ఉంచి పూజలు నిర్వహిస్తారు. సోమవారం భక్తులు మందగంపలతో వచ్చి బోనాలు వండి మొక్కులు చెల్లిస్తారు. మంగళవారం దేవరపెట్టె ముందు చంద్రపట్నం వేసి స్వామివారికి పెళ్లితంతు జరిపిస్తారు. బుధవారం కొత్త కుండలో పాలుపొంగించి బోనాలను వండి నెలవారం నిర్వహిస్తారు. ఆ తర్వాత దేవరపెట్టెను కేసారం గ్రామానికి తరలించడంతో జాతర ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని