logo

పల్లెలు.. ప్రగతి వీచికలు

గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందజేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా గ్రామాల వారీగా వివరాలు సేకరించింది.

Published : 27 Mar 2023 03:16 IST

జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాలకు ఎంపిక

గంగాపురంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందజేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా గ్రామాల వారీగా వివరాలు సేకరించింది. తొమ్మిది అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధుల కల్పన, ఆరోగ్య పంచాయతీ, బాలల స్నేహపూర్వక, సమృద్ధి నీటి వనరుల లభ్యత, పచ్చదనం పరిశుభ్రత, స్వయం సమృద్ధిగా మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక అంశాలకు వంద మార్కులతో 13 ప్రశ్నలను తయారు చేసి పారదర్శకతతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశారు. ఇటీవల మండల స్థాయిలో ఎంపిక చేసి పురస్కారాలు అందజేసింది. మండల స్థాయిలో ఎంపికైన వారి నుంచి ప్రతి అంశంలో ముగ్గురి చొప్పున 27 మందిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. భువనగిరి మండలం నుంచి మూడు గ్రామాలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. అక్కడ జరిగిన ప్రగతి సర్పంచుల మాటల్లోనే..

గ్రామానికి వచ్చిన సందర్భంగా మొక్క నాటుతున్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దా

గుండు మనీశ్‌కుమార్‌, వడాయిగూడెం, భువనగిరి మండలం

పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్‌ షెడ్‌తో పాటు అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వలు, గ్రామపంచాయతీ దుకాణాల సముదాయం ఏర్పాటు చేశాం.  హైదరాబాద్‌లో వివిధ స్వచ్ఛంద సంస్థలు అవార్డులతో సత్కరించాయి. జిల్లా ఉత్తమ అవార్డును కలెక్టర్‌ పమేలా సత్పతి చేతుల మీదుగా గత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అందుకున్నాను. బీటెక్‌ పూర్తి చేసినప్పటికీ మా తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లో చేరి సర్పంచి పోటీ చేసి గెలుపొందాను. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.


సమృద్ధి నీటి వనరుల విభాగంలో ఎంపిక

దారా సైదయ్య, గంగాపురం, గుండాల మండలం

సమృద్ధి నీటి వనరుల విభాగంలో మా గ్రామ పంచాయతీ ఎంపికైంది. సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అభివృద్ధిపై దృష్టి సారించాను. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ముందున్నాం. పచ్చదనం- పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మండల స్థాయి అవార్డుల్లోనూ ఆరు అంశాలలో నూటికి నూరు మార్కులు సాధించాం ప్రథమ స్థానంలో ఉన్నాం.


సుపరిపాలన అంశంలో..

బొమ్మారపు సురేశ్‌, తాజ్‌పూర్‌, భువనగిరి మండలం

గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వలను పూర్తిస్థాయిలో మెరుగు పరిచాం. వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్‌, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతల ఏర్పాటు, వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేశాం. హరితహారం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాం. వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి గ్రామంలో పూర్తి వివరాలను పొందుపరిచాం. మండల స్థాయిలో సామాజిక భద్రత, ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో అవార్డు అందుకున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో మా గ్రామంలోని 27 కుటుంబాలకు దళితబంధు మంజూరైంది. యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని