logo

మూడేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థానచలనం

ఈ ఏడాది చివరలో వచ్చే శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులు, ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేస్తూ ఉంటే వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అమలుకు ఉన్నతాధికారులు సమాయత్తమయ్యారు.

Published : 08 Jun 2023 03:22 IST

బదిలీ అయ్యే వారి గుర్తింపు ప్రక్రియ షురూ

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఈ ఏడాది చివరలో వచ్చే శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులు, ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేస్తూ ఉంటే వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అమలుకు ఉన్నతాధికారులు సమాయత్తమయ్యారు. అలాంటి వారిని గుర్తించే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మొదలైంది. మూడేళ్లకు మించి పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను గుర్తించి బదిలీ కోసం జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడేళ్ల వ్యవధిని లెక్కించేందుకు 2024 జనవరి 31వ తేదీని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. వచ్చే నెల 31 తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఉమ్మడి జిల్లాలో మూడేళ్లకు మించి పని చేస్తున్న అధికారులు, ఉద్యోగుల జాబితాను సిద్ధమవుతోంది. ఆయా శాఖల్లోని వివరాలను సేకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అక్కడ జాబితాను పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్లు బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఐదు వందల మంది అధికారులు, ఉద్యోగులు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది.

వీరికి బదిలీ

* రెవెన్యూ విభాగంలో జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, నోడల్‌ అధికారులు, తహసీల్దార్లు, అందుకు సమానమైన అధికారులు మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉండకూడదు.

* పోలీసుశాఖలో రేంజీ ఐజీ, డీఐజీలు, రాష్ట్ర సాయుధ పోలీసు విభాగ కమాండెంట్లు, జిల్లా ఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ఐ వరకు బదిలీ చేయాల్సి ఉంటుంది.

* ఎస్సైలను ఎట్టి పరిస్థితుల్లో సొంత జిల్లాలో నియమించకూడదు. ఇటీవల పదోన్నతి పొంది అదే ప్రాంతంలో పని చేస్తున్న వారికి కూడా స్థాన చలనం కల్పించాలి.

* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటికే భాగస్వాములైన అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముందస్తు అనుమతి తీసుకుని, ఆ ప్రక్రియ పూర్తి అయిన తరవాత బదిలీ చేయాల్సి ఉంటుంది.

* ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బదిలీ అయిన అధికారులు తక్షణం ఆ ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని