logo

ఆశలు ఆవిరై.. గుండెల బరువై!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మూలిగేనక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి.

Published : 20 Mar 2023 05:28 IST

అకాల వర్షం.. అపార నష్టం
పెనుగాలులతో కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు

సంగం : వర్షానికి నేలకొరిగిన వరి పైరు

న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌, వ్యవసాయం): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మూలిగేనక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పైరు వాలిపోయింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 129 గ్రామాల్లో పంట దెబ్బతింది. వరి 3,597.6 హెక్టార్లు, శనగ 600 హెక్టార్లు, పత్తి 252 హెక్టార్లు, నువ్వులు 22 హెక్టార్లు, వేరుశనగ 20 హెక్టార్లలో దెబ్బతింది. జిల్లాలో పంట నష్టాలపై ప్రాథమిక అంచనాలను  కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రభుత్వానికి పంపారు.

28.2 మి.మీ.వర్షపాతం

జిల్లాలో ఆదివారం సగటున 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోగోలు 79.8, రాపూరు 74.0, సంగం 60.4, కోవూరు 57.0, నెల్లూరు నగరం 50.0 మి.మీ. వర్షం కురిసింది. ఆత్మకూరు 48.4, కొడవలూరు 48.2, పొదలకూరు 46.2, బుచ్చిరెడ్డిపాళెం 42.6, విడవలూరు 41.4, చేజర్ల 38.0, నెల్లూరు గ్రామీణం 37.2, కొండాపురం 35.0, జలదంకి 33.8, వెంకటాచలం 30.6, అల్లూరు 29.6, దగదర్తి 28.6, మర్రిపాడు 27.2, కలిగిరి 26.8, కావలి 26.8 వింజమూరు 22.4, మనుబోలు 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలిగిరి మండలం కుమ్మరకొండూరులో గాలుల ప్రభావంతో అపార నష్టం కలిగింది.


కాయాకష్టం.. వర్షార్పణం

కావలి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓరుగుంట కృష్ణవేణి తనకున్న అరెకరాలో మామిడితోటలు సాగు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురిసిన గాలి, వడగండ్ల వానతో మామిడి కాయలు, పిందెలు, పూత రాలిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అధికారులు మామిడి తోటను పరిశీలించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.


కొనుగోలు కేంద్రాలు ఏవి?

తలుపూరుపాడుకు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ ఆరెకరాల్లో జిలకర మసూరీ వరి సాగు చేశారు. ముప్పొద్దులా కష్టం చేసి పండించిన ధాన్యాన్ని రహదారి పక్కన రాశి పోసి పడిగాపులు కాస్తున్నారు. శనివారం కురిసిన వర్షానికి నీరు చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాశిని సంరక్షించేందుకు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


జలదంకిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు


కుమ్మర కొండూరులో పైకప్పు లేచిపోయిన ఇల్లు


తడిచిన మిర్చి


నీటిలోనే పత్తి పైరు


గాలులకు ఇంటిపై కూలిన విద్యుత్తు స్తంభం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని