గాలి మారింది!
సాధారణ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించామన్న ధీమాతో ఉన్న వైకాపాకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే చమటలు పట్టిస్తున్నారు.
జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు
ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై తీవ్ర చర్చ
ఈనాడు డిజిటల్, నెల్లూరు:
సాధారణ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించామన్న ధీమాతో ఉన్న వైకాపాకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే చమటలు పట్టిస్తున్నారు. మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేయగా- తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అదే బాటలోకి రావడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి కారణమయ్యారనే నెపంతో అధికార వైకాపా చర్యలు తీసుకోవడం.. వారిలో ముగ్గురు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం.. జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జిల్లా వైకాపాకు కంచుకోట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప తర్వాత.. ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చేది కూడా ఇక్కడే. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అలాంటిది.. ప్రస్తుతం వైకాపా పతనానికి నాందీ కూడా నెల్లూరు నుంచే ప్రారంభమైందని సొంత పార్టీ నాయకులే పేర్కొంటుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని కొందరు అసహనంతో ఉండగా- మరికొందరు తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించమని పదే పదే అడిగినా పట్టించుకోవడం లేదంటూ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసేందుకు సచివాలయానికి వెళ్లినా.. కనీసం పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో జరిగిన మార్పులతో మరికొందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
అందుకే పోరుబాట!
తమను పట్టించుకోవడం లేదనేది ఒక కారణమైతే... తాము ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదనే కారణంతో వైకాపా ఎమ్మెల్యేలు.. ఆ పార్టీని వీడుతున్నారు. తొలుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వ తీరును బహిరంగంగానే విమర్శించారు. ఆల్తూరుపాడు రిజర్వాయరు, సర్వేపల్లి, సోమశిల లింకు కెనాల్ తదితర పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమావేశాల్లోనే ధ్వజమెత్తారు. ప్రభుత్వ సమావేశాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ అధికారులను నిలదీశారు. దాంతో ఆగ్రహించిన అధిష్ఠానం.. ఆయనకు వ్యక్తిగత భద్రతను కుదించడంతో పాటు నియోజకవర్గ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి అప్పగించింది. అప్పటి నుంచి ఆనం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది అదే బాట. తన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులకు ఆర్థిక అనుమతులు రావడం లేదని, సచివాలయానికి వెళితే కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయన పదే పదే తన నియోజకవర్గంలో సమస్యలను చెబుతూ.. వాటిని పరిష్కారించాలని డిమాండ్ చేయడం వైకాపా పెద్దలకు కోపం తెప్పించింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కోటంరెడ్డి ఆరోపించడం, తెలుగుదేశంలో చేరుతున్నట్లు కార్యకర్తలతో చెబుతున్న ఆడియో బయటకు రావడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో పరిశీలకుల పేరుతో ఇతరులను నియమించి నాశనం చేసినట్లు ఆరోపిస్తుండటం జిల్లాలో వైకాపా పరిస్థితి అద్ధం పడుతోంది. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
పుంజుకుంటున్న తెదేపా!
జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది. అధికార పార్టీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతోంది. వైకాపా నాయకుల ఆగడాలను బహిర్గతం చేస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డితో పాటు భారీగా కార్యకర్తలు పసుపు కండువా కప్పుకొన్నారు. నెల్లూరు నగరం, కావలి.. ఇతర నగరాల్లో.. వైకాపాల్లో వర్గపోరు ఉండటంతో తెదేపా విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
భారీ ర్యాలీగా తరలివెళ్లి...
కస్తూరిదేవి గార్డెన్ నుంచి భారీ కార్ల ర్యాలీగా బయలుదేరుతున్న గిరిధర్‌రెడ్డి
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: వైకాపా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడి తెదేపాలో చేరారు. శుక్రవారం ఉదయం నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి సుమారు రెండు వేల మంది కార్యకర్తలతో కలిసి మంగళగిరికి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నగర మేయర్ పొట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్, వైకాపా నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కూకటి హరిబాబుయాదవ్, వైస్ ఛైర్మన్ గుండాల మధుసూదన్‌రెడ్డి, ఆమంచర్ల ఉప సర్పంచి మలినేని వేణునాయుడు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల చక్రవర్ధన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు మలినేని వెంకయ్యనాయుడు, పలువురు కార్పొరేటర్లు చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తెదేపా కండువా కప్పుకొన్నారు. గిరిధర్‌రెడ్డి మంగళగిరి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు వైకాపా
చర్యలు రెండోసారి
కావలి, న్యూస్‌టుడే: శాసనమండలి ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థి పరాజయానికి కారణమంటూ.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడం జిల్లా చరిత్రలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 2007లో రాష్ట్రంలో శాసన మండలిని పునరుద్ధరించాక వచ్చిన తొలి ఎన్నికల్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సి.వి.శేషారెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు శేషారెడ్డి ఓటమికి కారణమయ్యారని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ ఎన్నికల్లో తెదేపా మద్ధతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గెలుపొందారు. అప్పుడు జిల్లాలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా- ఉమ్మడి నెల్లూరులోని పది నియోజకవర్గాల్లోనూ వైకాపా ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. ఆదాల, మేకపాటిలపై కాంగ్రెస్ సస్పెన్షన్ తొలగించగా.. కొమ్మి మాత్రం పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్