logo

కనుపాప వెలిగి.. కన్నపేగు ఒరిగి

అమ్మ.. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. వారి క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. బిడ్డల కష్టాలు.. కన్నీళ్లు తనవిగా చేసుకుంటుంది..

Published : 01 Jun 2023 02:12 IST

ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళల మృతి
న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

షాహీనా (పాత చిత్రం)

అమ్మ.. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. వారి క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. బిడ్డల కష్టాలు.. కన్నీళ్లు తనవిగా చేసుకుంటుంది..
వారి ఉన్నతికి ఎంత కష్టమైనా భరిస్తుంది.. శ్రమిస్తుంది.. అలాంటిది.. కన్నబిడ్డ ప్రాణాలకే ఆపదొస్తే.. నిలువగలదా!

తన ప్రాణాలనే అడ్డేస్తుంది.. బిడ్డకు పునర్జన్మనిస్తుంది.. నెల్లూరులో బుధవారం అదే జరిగింది... ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిన ఓ బిడ్డను కాపాడి.. ఇద్దరు తల్లులు తనువు చాలించడం అందరినీ కలచివేసింది.

నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో తిరుమల, సబిహా(29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ముగ్గురు కుమారులు. సబిహా నగరంలోని ఓ దుకాణంలో పని చేస్తుండగా- తిరుమల వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీరి ఇంటికి ఎదురుగా షాహీనా(25) తన కుమార్తెతో కలిసి ఉంటోంది. బీడీలు చుట్టి కుమార్తెను పోషించుకుంటోంది. సబిహా, షాహీనా స్నేహితులు. బుధవారం వీరిద్దరి పిల్లలు పెన్నానది తీరంలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో సబిహా మూడేళ్ల కుమారుడు రీహాన్‌ గుంతలో పడి మునిగిపోతుండగా గుర్తించిన సబిహా, షాహీనా అక్కడికి పరుగులు తీశారు. అతి కష్టంపై రీహాను గుంతలో నుంచి గట్టుపైకి చేర్చారు. ఆ ప్రయత్నంలో వారిద్దరూ కాలుజారి అందులో పడిపోయారు. ఈతరాక నీటిలో మునిగిపోయారు. విషయం గుర్తించిన ఓ మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గుంతలోకి దిగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాస్‌రెడ్డి, నవాబుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

తీరని విషాదం....  జరిగిన దుర్ఘటనతో భగత్‌సింగ్‌ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. సబిహా ప్రేమ వివాహం చేసుకుంది. భర్త వేరే రాష్ట్రంలో ఉండగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటోంది. షాహీనా కుటుంబంలో పెద్ద దిక్కు. ఒక్కగానొక్క కుమార్తెతో కలిసి జీవిస్తోంది. ఆమె మృతి చెందడంతో ఆరేళ్ల కుమార్తె అమ్మ ప్రేమకు దూరమైంది. ఆ పిల్లలు విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.

తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరవుతున్న సబిహా కుమారుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని