logo

పునరావాసం.. దొరకని స్థలం

ఓడరేవు నిర్మాణంలో భాగంగా తొలగించిన గ్రామాల వాసులకు పునరావాసం కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అధికారులు ప్రతిపాదించిన స్థలం తీసుకోవడానికి బాధితులు ససేమిరా అంటున్నారు.

Published : 07 Jun 2023 04:33 IST

కర్లపాలెం గ్రామం (పాత చిత్రం)

ఓడరేవు నిర్మాణంలో భాగంగా తొలగించిన గ్రామాల వాసులకు పునరావాసం కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అధికారులు ప్రతిపాదించిన స్థలం తీసుకోవడానికి బాధితులు ససేమిరా అంటున్నారు. మేము చెప్పిన చోట ఇవ్వాలని కోరుతున్నారు. అది సాధ్యం కాదని పాలకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇది పీటముడిగా మారింది.

కందుకూరు, న్యూస్‌టుడే : రామాయపట్నం ఓడరేవును సుమారు 832 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాలను తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మొండివారిపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలకు చెందిన 250 మందికి రామాయపట్నం -తెట్టు మార్గంలో 23 ఎకరాలు కేటాయించారు. అక్కడ ఇప్పటికే మొండివారిపాలెం వాసులు సగానికి పైగా ఇళ్లు నిర్మించుకోగా మిగిలినవి  సాగుతున్నాయి. ఆవులవారిపాలెం వాసులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. కర్లపాలేనికి చెందిన సుమారు 200 మందికి పునరావాసం కల్పించాల్సి ఉంది వీరికి నివాస స్థలం కేటాయించడం అధికారులకు సవాలుగా మారింది. సుమారు ఇరవై ఎకరాల స్థలం అవసరం కాగా అంతమొత్తం స్థలం రావూరు, రామాయపట్నం, తెట్టు పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం కొనుగోలు చేయాల్సి ఉంది. వారు కోరుకున్న చోట స్థలం కొనుగోలు చేయడానికి  అధికారులు వెనక్కి తగ్గుతున్నారు.

* రామాయపట్నం సమీపంలో చర్చి పక్కన ఉన్న మాగాణి భూమిని ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ ఎకరా సుమారు రూ.80 లక్షలు ఉందని అంత ఇస్తేనే భూములిస్తామని రైతులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చే అవకాశం లేదు. చేవూరులో రైతుల నుంచి సేకరించిన భూమికి రూ.22.50 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఎక్కువ ధర కావడంతో అధికారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ స్థలం కేటాయిస్తే చేపల వేటకు అనుకూలంగా ఉంటుందనేది కర్లపాలెం వాసుల వాదన. ఓడరేవుకు రైల్వే లైను వేస్తున్నారు. ఇందుకోసం సాలిపేట సమీపంలోని కాసా కాలనీని తొలగించాలి. సుమారు 80 మందికి పునరావాసం కల్పించాలి. ఇందుకోసం మరో పది ఎకరాలు అవసరం. వీరందరికీ భూమి చూడడం పెద్ద సమస్యగా మారింది.

ఆ స్థలమే మాకు అనుకూలం

మా గ్రామస్థులకు రామాయపట్నం చర్చి సమీపంలోని భూమి అనుకూలంగా ఉంటుంది. అక్కడ రైతులు అధిక ధర చెబుతున్నారు. అధికారులు పరిశీలించి ఆ భూమిని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి

సి.రమణయ్య, సర్పంచి, సాలిపేట

పరిశీలిస్తున్నాం

కర్లపాలెం, కాసా కాలనీ వాసులకు పునరావాసం కల్పించేందుకు స్థలాన్ని వెదుకుతున్నాం. కర్లపాలెం గ్రామస్థులు సూచించిన భూమి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాలతో భూమిని కొనుగోలు చేస్తాం.

సూర్యనారాయణ సింగ్‌, తహసీల్దారు, గుడ్లూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని