logo

అధనం.. నీదే భారం!

ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది.

Published : 28 Mar 2024 04:42 IST

ఎన్నికల ఖర్చులకు అధికార పార్టీ వసూళ్ల పర్వం

స్థిరాస్తి వ్యాపారులు, ప్రైవేటు సంస్థల నిర్వాహకులకు హుకుం

 ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. ఆ క్రమంలో బరువు కాస్తయినా తగ్గించుకునేందుకు అధికార పార్టీ నాయకులు కొందరు హుకుం జారీ చేస్తున్నారు. గత అయిదేళ్లలో తమ వల్ల లబ్ధి పొందిన వ్యాపారులు, స్థిరాస్తి లేఅవుట్ల నిర్వాహకులు, విద్యా సంస్థలు తదితరాలకు ఫోన్‌ చేసి ‘సర్దుబాటు’ కోరుతున్నారు. ఆయా వర్గాలతో సమావేశం నిర్వహించి.. ఎవరు ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తున్నారు. కొందరికి కొన్ని డివిజన్లు, వార్డులు, గ్రామాల బాధ్యత తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొందరు కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఆ మొత్తాలను నోటిఫికేషన్‌ వచ్చే వరకు వినియోగించాలని సూచిస్తున్నట్లు సమాచారం.

ముందు జాగ్రత్తగా ...ప్రచార ఖర్చులకు..

నెల్లూరు నగరంతో పాటు జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని భూముల ధరలు 5 నుంచి పది రెట్లు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరా ధర రూ.10 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.కోటి పలుకుతోంది. ఇలా ధరలు భారీగా పెరిగిన ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు అనేకం పుట్టుకొచ్చాయి. దీంతో కొందరు అభ్యర్థులు, వారి అనుచరులకు స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు ఇప్పుడు ఏటీఎంలుగా మారారు. ఇటీవల ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి భారీ ర్యాలీ, సభ నిర్వహించగా.. దానికి అవసరమైన వాహనాల కిరాయి, పెట్రోల్‌ ఖర్చులను ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భరించారు.

‘కరోనా సమయంలో ఆసుపత్రులకు అనుమతులు ఇప్పించాం.. ప్రభుత్వ భూములు ఆక్రమించినా, కాలువలు కలిపేసుకున్నా లేఅవుట్‌ జోలికి ఎవరు రాకుండా అడ్డుకున్నాం.. భవన నిర్మాణ అనుమతులు ఉల్లంఘించినా సహకరించాం. ప్రభుత్వ భూములు ఆక్రమించినా, రెవెన్యూ రికార్డులు తారుమారు చేసినా, ఇరిగేషన్‌ స్థలాల్లో నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఇసుక, మట్టి, గ్రావెల్‌ అనధికారికంగా రాత్రింబవళ్లు తవ్వి తరలిస్తున్నా.. మీ వైపు ఎవరూ రాకుండా.. అడ్డుకోకుండా కాపు కాశాం. ప్రస్తుతం ఎన్నికలు వచ్చాయి. మీరంతా పార్టీకి సహకరించాల్సిన అవసరం ఉంది. వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మళ్లీ సహకరిస్తాం. లేదంటే మీ ఇష్టం’ అని హెచ్చరికలు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత అయిదేళ్లలో నెల్లూరు నగరంతో పాటు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. విచ్చలవిడిగా లేఅవుట్లు వెలిశాయి. వాటిని వేసిన సమయంలో ఆ ప్రాంతాన్ని బట్టి స్థానిక అధికార పార్టీ నాయకులకు రూ. లక్ష నుంచి రూ. 5లక్షల వరకు సమర్పించుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలా కుదరకపోతే.. లేఅవుట్లలోని కొన్ని ప్లాట్లను వారి అనుచరుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ డబ్బు అడుగుతుండటంతో కష్టంగా ఉందని ఓ వ్యాపారి వాపోవడం పరిస్థితికి అద్దం పట్టింది.

ఆక్రమణలకు అండగా ఉన్నారని..

భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో సాగునీటి కాలువలు, ప్రభుత్వ భూములు, అసైన్డ్‌, దేవాలయ, వక్ఫ్‌భూములు, వాగు పోరంబోకు భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం చేశారు. ప్రత్యేకించి నెల్లూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌, కోవూరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన స్థిరాస్తి లావాదేవీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. వాటికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

నేతలకూ వ్యాపారాలు

2019 ఎన్నికలకు ముందు సాధారణ ద్విచక్ర వాహనంపై తిరిగిన ఓ నాయకుడు.. ఆ తర్వాత స్థిరాస్తి వ్యాపారం చేసి ఏకంగా రూ. 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించారు. భూముల ధరలు పెరిగే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి.. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనడం, బినామీ వ్యాపారులతో వెంచర్లు వేయించడంతో లబ్ధి పొందిన వ్యాపారులు ప్రస్తుతం సాయం చేస్తున్నారు.

 భూములు కాపాడుకునేందుకు

ఓ వ్యాపార సంస్థకు జాతీయ రహదారికి దగ్గర్లో ఒకే చోట 50 ఎకరాలకు పైగా ఉంది. మార్కెట్టు విలువ రూ.100 కోట్ల మాటే. దాన్ని కాపాడుకోవాలంటే అక్కడి ప్రజాప్రతినిధి సహకారం అవసరమనే ఉద్దేశంతో ఎన్నికల ఖర్చులను భరిస్తున్నట్లు  ఓ నాయకుడు తెలిపారు. వారితో మంచిగా లేకపోతే.. భూములకు ఏదో ఒక నోటీసు ఇప్పిస్తారు. దాంతో వివాదం మొదలై వాటిని అమ్ముకోలేక  నష్టపోతాం. ఆ గొడవలన్నీ ఎందుకులే.. అని ఎన్నికల ప్రచారంలో రూ.కోటి, అంతకు కాస్త ఎక్కువో ఇస్తే రాబోయే అయిదేళ్లూ సాయపడతారని ఇస్తున్నారని మరో నాయకుడు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని