logo

పరిశ్రమలపై పగ.. ఉపాధి దగా!

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది’- ఈ మాట చెప్పుకోవడానికి తప్పితే.. క్షేత్రస్థాయిలో పురోగతి మాత్రం కనిపించడం లేదు. గడిచిన అయిదేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ ఏర్పాటు కాలేదు.

Updated : 17 Apr 2024 05:17 IST

ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటులో తీవ్ర జాప్యం
స్థాపనకు నోచుకోని కొత్త యూనిట్లు ఎన్నో
జగన్‌ అయిదేళ్ల పాలనలో అంతా తిరోగమనమే

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది’- ఈ మాట చెప్పుకోవడానికి తప్పితే.. క్షేత్రస్థాయిలో పురోగతి మాత్రం కనిపించడం లేదు. గడిచిన అయిదేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ ఏర్పాటు కాలేదు. తమ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉపాధి దొరుకుతుందనే ఆశతోభూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రూ. కోట్లు ఖర్చు పెట్టిన ప్రాంతాలు నిరుపయోగంగా మారాయి. పిచ్చి మొక్కలు, అధ్వాన రహదారులకు అడ్డాగా మారాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు తెస్తాం.. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు... ప్రస్తుతం పత్తా లేకుండా పోవడంతో నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. చిన్న పరిశ్రమలను చేయి పట్టుకు నడిపిస్తామని చెప్పిన జగన్‌.. ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు. గత మూడేళ్లుగా వాటికి కనీస ప్రోత్సాహకాలు అందించలేదనే విమర్శలు నెలకొన్నాయి.

 ఈనాడు, నెల్లూరు

జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, పవర్‌ప్రాజెక్టులు, గమేషా తదితర తొమ్మిది మెగా ప్రాజెక్టులతో పాటు.. 30 భారీ పరిశ్రమలు, 7,588 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా- వీటి ద్వారా రూ.49 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. వీటితో పాటు మరో 10 భారీ, మెగా పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇదంతా గత ప్రభుత్వాల హయాంలో జరిగినవే. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమల సంగతి పక్కన పెడితే.. గతంలో మంజూరై, వివిధ దశల్లో ఉన్నవీ ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో 4,146 ఎకరాల్లో 22 పారిశ్రామికవాడలను అందుబాటులోకి తెచ్చామని చెబుతున్న అధికారులు.. వాటిలో ఏర్పాటు చేసిన పరిశ్రమలపై మాత్రం సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. జిల్లాలోని ఏ పారిశ్రామిక పార్కును చూసినా రాళ్లూరప్పలు తప్ప పరిశ్రమల జాడే కనిపించదు. పిచ్చి మొక్కల మధ్య ఏపీఐఐసీ ఏర్పాటు చేసిన బోర్డులను చూస్తే తప్ప.. అవి పారిశ్రామిక పార్కులని తెలియని దుస్థితి. ఇక మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్న వాటినే ప్రభుత్వం వెళ్లగొడుతుండటంతో.. కొత్తవి రావడం కష్టంగా మారింది.

 వేలాది ఎకరాలు నిరుపయోగం

జిల్లాలో వ్యవసాయం, ఆక్వా తర్వాత పారిశ్రామిక రంగం ప్రాధాన్యమైంది. ఎంఎస్‌ఎంఈల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. చిన్న పరిశ్రమలు విరివిగా రావాలంటే ప్రోత్సాహకాలు, రాయితీలు అవసరం. భారీ పరిశ్రమల ఏర్పాటుతో.. వాటికి ఆర్డర్లు అందుతాయి. ఈ విషయాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని దెబ్బతీసింది. జిల్లాలో ఇప్పటికే ఏర్పాటైన భారీ పరిశ్రమల యాజమాన్యాలను రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేస్తోంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావాలంటేనే భయపడేలా వ్యవహరించింది. దీంతో ఎంఎస్‌ఎంఈల ఉనికికే ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో రైతుల నుంచి బలవంతంగా, ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టి సేకరించిన వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఇఫ్కో ఎరువుల కర్మాగారం నిర్మిస్తామని చెప్పి.. రైతుల నుంచి 2,776 ఎకరాలు సేకరించిన సంస్థ.. కేవలం గమేషా, సీమన్స్‌ సంస్థలు మాత్రమే ఏర్పాటు చేసింది. ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఆ భూములన్నీ బీడుగా మారాయి. మిథాని, క్రిబ్కో వంటి భారీ పరిశ్రమలు జిల్లా నుంచి వెళ్లిపోయాయి. దీంతో 1,950 మందికి ఉపాధి లేకుండా పోయింది.

ఉదాసీన వైఖరితో.. వెనకబాటు

పరిశ్రమలు ఏర్పాటు కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం అసాధ్యమని తెలిసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి ఉదాసీనంగా వ్యవహరించింది. వైకాపా అధికారంలోకి వచ్చీ రావడంతోనే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టింది. ఆ ప్రభావం పరిశ్రమలపై పడింది. భారీ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమల సంఖ్య తగ్గింది. పారిశ్రామిక పార్కుల్లో భూములు ఖాళీగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఆత్మకూరు:

నారంపేట పారిశ్రామికవాడలో వేసిన రోడ్డు

ఆత్మకూరు పరిధిలోని నారంపేట పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి 2020 సెప్టెంబరులో అడుగు పడింది. నాటి మంత్రి దివంగత మేకపాటి గౌతంరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట్లో సెంచురీ ప్లైవుడ్‌ పరిశ్రమ వస్తుందని హడావుడి చేయగా.. అది చివరకు వైఎస్‌ఆర్‌ జిల్లా గోపవరానికి వెళ్లింది. ఆ తర్వాత ఇక్కడ పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు రూ. 13 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం రూ. 23.4 కోట్ల వ్యయంతో ప్రారంభమైన రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. విద్యుత్తు, నీటి వసతి కల్పించలేదు. ఒక్క మంచి పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడలేదు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధి సామిల్లు, చెక్క ఫర్నిచర్‌ తయారీకి ముందుకొచ్చారని, వారితో ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించడంతో స్థానికులు విస్తుబోతున్నారు.  

కావలి

కావలి మండలంలో మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ కలగానే మిగిలింది. రామాయపట్నం ఓడరేవుకు అనుసంధానంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చెన్నాయపాళెం, అనెమడుగు, తుమ్మలపెంట గ్రామాల పరిధిలో 2001.78 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 2020లోనే అధికారులు సర్వే చేశారు. గ్రామసభలు జరిగాయి. ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం నుంచి డబ్బు రాకపోవడంతో ఆలస్యమైందని కావలి ప్రజలు చర్చించుకుంటున్నారు.

కొడవలూరు :

బొడ్డువారిపాళెం పారిశ్రామిక పార్కు

బొడ్డువారిపాళెం, కొత్తపల్లి కౌరుగుంట గ్రామాల్లో 42.15 ఎకరాలు, 49.89 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారు. రూ. కోట్లు ఖర్చు చేసి.. రోడ్లు వేయడంతో పాటు సుమారు 500 ప్లాట్లు అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు అక్కడ కేటాయించిన ప్లాట్ల సంఖ్య కనీసం వంద దాటలేదు. భూములు తీసుకున్నవారు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతం పిచ్చి చెట్లతో నిండిపోగా- రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పరిశ్రమలు వస్తే.. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో.. భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చదువు పూర్తయిదంటే భయం

బీటెక్‌ పూర్తవుతున్న విద్యార్థులు.. కళాశాల నుంచి బయటకు రావాలంటేనే ఉద్యోగ భయంతో వణికిపోతున్నారు. రాజధాని నిర్మాణం జరిగి, పరిశ్రమలు, ఐటీ సంస్థలు వచ్చి ఉంటే.. ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరికేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, భూములు ఉన్నా.. గడిచిన అయిదేళ్లలో ఒక్క మంచి కంపెనీ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే చదువు పూర్తి చేసిన మా సీనియర్లు కూడా ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారు. స్థోమత లేని వారు చాలా మంది బీటెక్‌తో ఆపేసి స్థానికంగా ఏదో ఒక పనికి వెళుతున్నారు. 

 తరుణ్‌గుప్తా, నెల్లూరు


ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి

చదువులు పూర్తయిన యువతకు మా ప్రాంతంలో ఉపాధి కల్పించే అవకాశాలే లేవు. నారంపేట ఇండస్ట్రీయల్‌ పార్కు అభివృద్ధి చెంది, పరిశ్రమలు వస్తాయని ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ ఒక్కటి రాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇక్కడే ఉపాధి దొరికేలా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 పి.రామకృష్ణ, నిరుద్యోగి, ఆత్మకూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని