logo

వైకాపా నాయకుల దందా

వైకాపా పాలన కొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. ఉన్న కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు వైకాపా నాయకులు దందాలకు పాల్పడుతున్నారు.

Published : 17 Apr 2024 03:52 IST

రోడ్డు అంచున స్థలాలు ఆక్రమించి అద్దెకు}
న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

ప్రధాన రైల్వేస్టేషన్‌ ఎదురుగా రోడ్డునుఆక్రమించి పూల మొక్కల వ్యాపారం

 వైకాపా పాలన కొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. ఉన్న కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు వైకాపా నాయకులు దందాలకు పాల్పడుతున్నారు. రహదారుల పక్కనున్న ఖాళీ స్థలాలను వారి అనుచరులతో ముందుగా ఆక్రమించి ఆ తర్వాత స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఆక్రమణకు గురి కావడంతో పాటు కుంచించుకు పోతున్నాయి.

అధికార పార్టీ కార్యకర్తలే సూత్రధారులు

నెల్లూరు నగరంలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఆక్రమణల దందా నడిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నగరంలోని ఇరుగాళమ్మ సంఘం, బట్వాడిపాళెం, ఆత్మకూరు బస్టాండు, మద్రాసు బస్టాండు, ముత్తుకూరు రోడ్డు, కరెంటు ఆఫీసు సెంటరు, సర్వజన ఆసుపత్రి తదితర ప్రాంతాల్లోని రోడ్ల పక్కన ఇటీవల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. స్థలాలను ఆక్రమించి దుకాణాలు వేసి నిరుపేదలకు అద్దెలకు ఇస్తున్నారు. ఒక్కో దుకాణానికి ప్రాంతాన్ని బట్టీ నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. తొలుత తాత్కాలిక బడ్డీ దుకాణాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్డుపక్కన ఆక్రమణలపై గతంలో కొందరు స్పందనలో కలెక్టర్‌కు, కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు. నెలలు గడుస్తున్నా.. స్పందన లేదు. అధికారులు స్పందించి ఆక్రమణలు అడ్డుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని