logo

రైతు జపం.. ఏదో నెపం

కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.

Published : 18 Apr 2024 03:28 IST

అయిదేళ్లలో కౌలుదారులకు కన్నీళ్లే
ప్రయోజనాలు దక్కింది అంతంత మాత్రమే

కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. కార్డులు లేక.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు. సగటున 10 శాతం మందికి కూడా రాయితీ పథకాలు, పంట రుణాలు అందడం లేదు.

ఈనాడు, నెల్లూరు: ప్రతి కౌలు రైతుకూ.. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులిస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చూస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం’ అని 2018లో జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప యాత్రలో హామీ ఇచ్చినా.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ఏటా ఇచ్చే పంట రుణాల్లో.. వారికి అయిదు శాతం కూడా అందడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. గడిచిన అయిదేళ్లలో బయట అప్పు పుట్టే దిక్కులేక చాలా మంది సాగుకు దూరమయ్యారు.

గుర్తింపు కార్డులు ఇచ్చింది అరకొరే

జిల్లాలో 90 వేల మంది కౌలుదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 40వేల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మొదటి ఏడాది 11,207 మందికే ఇచ్చారు. అయిదేళ్లలో ఆ సంఖ్య 15,859కి చేరింది. వీరికి రుణాలు ఇప్పించాలని చెబుతున్నా.. బ్యాంకర్లు సుముఖంగా లేకపోవడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. బ్యాంకర్లకు అవగాహన కల్పించాల్సిన అధికారులు.. మొక్కుబడి సమావేశాలు నిర్వహించి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆర్థికంగా కౌలు రైతులు నష్టపోతున్నారు.

సగటు అప్పు రూ.2 లక్షల పైనే

ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, వరదలు, చీడపీడలు ఆశించడం, ధరలు లేకపోవడం తదితరాలతో కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా మంది రూ. రెండు వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇంట్లోని కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఒక ఏడాది అప్పు మిగిలితే.. అసలు, వడ్డీ కలిపి మళ్లీ నోటు రాస్తున్నారు. సగటున ఒక్కో కౌలు రైతుపై రూ.2లక్షలకుపైనే అప్పు ఉందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.

ఎలాంటి లబ్ధి లేదు

పెరిగిన ఖర్చులతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. రూ. 100 ఖర్చుపెడితే రూ. 10 ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు పడి నష్టపోతే ఇక అంతే. ఎకరా కౌలు రూ. 30వేల నుంచి రూ.40వేల వరకు ఉంటుంది. ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్డు ఇచ్చినా.. బ్యాంకులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో రూ.3 వడ్డీకి తెచ్చి సాగు చేస్తున్నాం. ప్రభుత్వం కౌలు రైతులకు సాయం అందిస్తున్నామని చెబుతున్న ఏ ఒక్కటీ.. క్షేత్రస్థాయిలో అందడం లేదు.

రాధాకృష్ణరెడ్డి, జగదేవిపేట

కార్డు లేదు.. రుణం అందలేదు

నేను ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. బాగా పంట పడితే ఖర్చులన్నీ పోను ఎకరాకు రూ.8వేల వరకు మిగులుతుంది. ఏదైనా జరిగితే పూర్తిగా నష్టపోతునున్నాం. ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో రూ. 300 ఉన్న పొటాష్‌.. రూ.900 అయ్యింది. యూరియా బస్తా రూ.240 నుంచి రూ.310కి చేరింది. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. మాకేమీ అవి అందడం లేదు. కనీసం గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదు. రైతు భరోసా కూడా భూ యజమానులకు వెళుతుందిగానీ.. రైతులకు కాదు..

వేణు, రైతు, పల్లిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు