logo

మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!

సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి.

Updated : 24 Apr 2024 05:15 IST

న్యూస్‌టుడే, వెంకటాచలం, విడవలూరు

వెంకటాచలంలోని పరిశ్రమల కేంద్రం

సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకు దక్కించుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి... గతంలో అరకొర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని మూతపడ్డాయి.  

వెంకటాచలంలోని కాకుటూరు పంచాయతీ పరిధిలో గొలగమూడి రోడ్డు వద్ద జాతీయ రహదారి సమీపంలో కొన్నేళ్ల క్రితం పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో పరిశ్రమల ఏర్పాటునకు పలువురు దరఖాస్తులు చేసుకోగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు కేటాయించారు. కొందరికి తక్కువ ధరలకే అప్పగించారు. ఇక్కడి స్థలాలకు మంచి గిరాకీ ఉండటంతో వందల కొద్ది దరఖాస్తులొచ్చాయి. అందరికీ స్థలాలిచ్చారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులో పేర్కొన్న విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా 80 శాతం మంది అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. పది శాతం మాత్రమే పరిశ్రమలు నిర్మించి అరాకొరగా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. కొందరు వాటిని అద్దెకివ్వగా... మరి కొందరు అతిథి గృహాలుగా వినియోగిస్తున్నారు.

క్రిభ్‌కో సా...గుతోంది

సర్వేపల్లి పంచాయతీ పరిధిలో క్రిభ్‌కో సంస్థ ఎరువుల కర్మాగారం ఏర్పాటునకు 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఏపీˆఐఐసీˆ ద్వారా మొత్తం 289 ఎకరాలు కేటాయించింది. రూ.2వేల కోట్లతో కర్మాగారం ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటునకు 2016లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టించుకోలేదు. ఆరు నెలల క్రితం బయో ఇథనాల్‌ కేంద్రం ఏర్పాటునకు శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇదే పంచాయతీ పరిథిలో పైపుల తయారీ కర్మాగారం ఏర్పాటునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. తెదేపా పాలనలో పైపుల తయారీ పనులు నిర్వహిస్తుండగా ఏడాదిన్నర నుంచి నిలిపేశారు.


ఉపాధి ఏదీ?

స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్న లక్ష్యంతోనే పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేసి తక్కువ ధరలకు స్థలాలిచ్చారు. పరిశ్రమల కేంద్రం ఏర్పాటైతే ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశించారు. క్రమంగా ఏర్పాటు చేసినవి మూసివేయడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వెంకటాచలంలోని పరిశ్రమల కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ఒక గదిలో ఎర్ర చందనం దుంగల నిల్వలు పట్టుబడగా... ఒక పరిశ్రమలో నిషేధిత గుట్కాలు తయారు చేస్తూ పట్టుబడ్డారు. అక్కడ నిర్మించిన గదుల్లో జూదం ఆడుతూ పలుమార్లు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పరిశ్రమలో నూనె అక్రమంగా తయారు చేస్తుండగా పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని