logo

ఇబ్బందుల్లేకుండా సరకు రవాణా

నిజామాబాద్‌ జంక్షన్‌ మీదుగా సరకు ఎగుమతి, దిగుమతి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ద.మ. రైల్వే డీఆర్‌ఎం శరత్‌చంద్ర పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మర్చంట్‌ అసోసియేషన్‌,

Published : 20 May 2022 03:10 IST

మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మాట్లాడుతున్న డీఆర్‌ఎం శరత్‌చంద్ర

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జంక్షన్‌ మీదుగా సరకు ఎగుమతి, దిగుమతి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ద.మ. రైల్వే డీఆర్‌ఎం శరత్‌చంద్ర పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మర్చంట్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే నిజామాబాద్‌ నుంచి సరకు రవాణా పెరిగిందన్నారు. పసుపు ఎగుమతి ద్వారా ఏడాది కాలంలో రూ.5 కోట్ల టర్నోవర్‌ జరిగిందని చెప్పారు. ఎగుమతిపరంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న అన్నిరకాల ఇబ్బందుల పరిష్కారం కోసం చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. జాన్కంపేట్‌, డిచ్‌పల్లికి గూడ్స్‌ షెడ్లు తరలించామని, అక్కడ హమాలీలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 24 గంటలు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సదుపాయం లేకపోవడంతో వెయిటింగ్‌ ఛార్జీలు తమకు భారంగా మారుతున్నాయని వ్యాపారులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రివేళల్లోనూ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి, మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. ఎఫ్‌సీఐ అధికారి ప్రసన్నకుమార్‌, సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వెంకన్న, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ వినతి..  నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 4, 5 ప్లాట్‌ఫాంల విస్తరణ సందర్భంలో హనుమాన్‌ మందిరానికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆలయ కమిటీ ప్రతినిధులు రెంజర్ల నరేష్‌, రోషన్‌లాల్‌ బోరా, స్వామి యాదవ్‌, సుధీర్‌ డీఆర్‌ఎంను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. నిజామాబాద్‌ స్టేషన్‌లో రిజర్వేషన్‌ కోటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని