logo

అవసరాల నిధి.. అక్కరకు రాదేమి..!

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమనిధి(జడ్పీ జీపీఎఫ్‌) ప్రభుత్వ అవసరాల బాంఢాగారంలా మారింది.

Published : 03 Jun 2023 05:22 IST

 చేతికందని అడ్వాన్సులు, పాక్షిక ఉపసంహరణలు 

 ఎనిమిది నెలలుగా ఎదురుచూపులే..

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమనిధి(జడ్పీ జీపీఎఫ్‌) ప్రభుత్వ అవసరాల బాంఢాగారంలా మారింది. గృహ నిర్మాణం, ఆరోగ్య సంబంధ, వివాహ శుభకార్యాలు, పిల్లల చదువులు తదితరాల కోసం జిల్లాపరిషత్‌లో జమ చేసుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి కొంత రుణం లేదా పాక్షిక ఉపసంహరణలు చేసుకుందామని దరఖాస్తు చేసుకున్నవారు.. వాటి కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తాన్ని సర్కారు వినియోగించుకోవడంతో సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది అన్న చందంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ప్రక్రియ ఇలా..

ప్రతి ఉద్యోగి మూలవేతనంలో 6 శాతం ప్రావిడెంట్‌ ఫండ్‌ కింద జమ చేస్తారు(సీపీఎస్‌ ఉద్యోగులకు ఈ వెసులుబాటు లేదు). అవసరమైనప్పుడు అడ్వాన్సు రుణం కింద ఈ నిధిలో నుంచి 70-80 శాతం తీసుకోవచ్చు. 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, 20 ఏళ్లు పూర్తయినవారు గృహ నిర్మాణ, వివాహాది శుభకార్యాలు, పిల్లల చదువుల కోసం పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు.

ఇదీ పరిస్థితి

నిజామాబాద్‌ జిల్లాపరిషత్‌ పరిధిలో దాదాపుగా 15 వేల జీపీఎఫ్‌ ఖాతాలున్నాయి. వీటిలో ఉపాధ్యాయులకు సంబంధించివి 5,500. గతేడాది నవంబరు నుంచి అడ్వాన్సు రుణం, పాక్షిక ఉపసంహరణలకై వచ్చిన దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. జిల్లాలో దాదాపుగా 600 మంది తమ సొమ్ముకై ఎదురుచూస్తున్నారు. అనధికార ఫ్రీజింగ్‌ కొనసాగడం, ఈ-కుబేరు వ్యవస్థతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న 1-2 నెలల్లోనే నగదు జమ చేసేవారు.

రూ.15 కోట్ల వడ్డీ బకాయిలు..

* జడ్పీ జీపీఎఫ్‌కు సంబంధించి 2019-20 వరకు వార్షిక లెక్కల ప్రక్రియ పూర్తయింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలవి స్లిప్పుల ప్రక్రియ కొనసాగుతోంది. * జిల్లా కార్యాలయంలోని ఈ విభాగంలో సిబ్బంది తక్కువగా ఉండటంతో రెండు జిల్లాల ఖాతాల విభజన ప్రక్రియ ఇప్పటికీ సాగుతూనే ఉంది. * జడ్పీ జీపీఎఫ్‌కు సంబంధించి వడ్డి సొమ్ము గత ఆరేళ్లుగా జమ కావడం లేదు. జిల్లాకు దాదాపుగా 15 కోట్ల వడ్డీ జమ కావాల్సి ఉంది.


త్వరగా మంజూరు చేయాలి
- నరేశ్‌, పీఆర్టీయూ నాయకుడు

చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్‌ రుణం అడ్వాన్సులకై నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి వీలైనంత త్వరగా సొమ్ము మంజూరు చేయాలి. దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా ప్రక్రియ చేపట్టాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని