logo

కొమ్మును కొట్టేస్తున్నారు!

అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో.

Updated : 28 Mar 2024 04:47 IST

నిజామాబాద్‌ యార్డులో నిఘా కరవు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

త్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో. దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. క్వింటా రూ.10 వేల పైచిలుకు పలుకుతున్న నేపథ్యంలో సంచుల కొద్ది ఎత్తుకెళ్తున్నారు.

బంగారంతో పోటీ..

నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఇప్పుడు పసుపు సీజన్‌ నడుస్తోంది. నిత్యం 10 వేల రాశులు యార్డుకు వచ్చే సందర్భం. రెండు కిలోలు వెంట తీసుకెళ్లినా రూ.300 నష్టపోతారు. ఇది రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ ఖరీదు. పసుపు కొమ్ము చోరీ జరిగిందంటే అటు రైతైనా? కమీషన్‌ ఏజెంటైనా? ఆర్థికంగా నష్టపోవాల్సిందే. ఆరు నెలల పాటు కష్టనష్టాలు ఓర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చే రైతులు కుప్పల వద్ద పంట తూకం పూర్తయ్యే వరకు వేచి చూడడం లేదు. ఇదే కేటుగాళ్లకు అవకాశంగా మారింది. ఫలితంగా కుప్పకు కొంత అనుకున్న క్వింటాళ్ల కొద్దీ పంట పక్కదారి పడుతుందనే ఆరోపణలొస్తున్నాయి. సీజన్‌ కావడంతో ఒకటి అనుకొని మరో రాశి పోస్తుంటారు. దీంతో ఏది ఎందులో కలుస్తుందో తెలియని పరిస్థితి. వందల మంది వివిధ స్థాయిల్లో హమాలీలుగా పనిచేస్తారు? ఎవరిని తప్పు పట్టే పరిస్థితి లేదు. తనిఖీ చేసేందుకు 60 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కానీ ఏ సరకు ఎటు పోతుందో నిఘా పెట్టడం లేదు. ఇటీవల పసుపు తమ కుప్పల్లో తగ్గుతుందని భావించిన పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా ఓ ఆటోలో 40 కిలోల పసుపు బస్తా తనిఖీల్లో దొరికింది. యార్డు దాటి వెళ్తుండగా అనుమానం వచ్చి ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశం వారికి రివార్డు ఇచ్చి సత్కరించారు. పక్కాగా ప్రతి వాహనం, మనిషిని తనిఖీ చేస్తే పారదర్శకంగా పంట కొనుగోళ్లు జరుగుతాయని సిబ్బందికి సూచించారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ కార్యదర్శిని వివరణ కోరగా ఇకపై ప్రత్యేకంగా నలుగురు మహిళ సెక్యూరిటీ సిబ్బందిని విధుల్లో ఉంచుతామని, ప్రతి దగ్గర నిఘా పెడతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని