logo

కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు

దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు.

Published : 29 Mar 2024 07:38 IST

 భాజపా గూటికి భర్తృహరి, సిద్ధాంత్‌, దమయంతి  

స్వాగతించిన నడ్డా, ఇతర నాయకులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. ఆ పార్టీ కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఉపాధ్యక్షుడు ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రధాన కార్యదర్శి వినోద్‌ దావతే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సమక్షంలో కటక్‌ సిటింగ్‌ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌, బ్రహ్మపుర మాజీ ఎంపీ, ఒడియా సినీహీరో సిద్ధాంత్‌ మహాపాత్ర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన ప్రముఖ సంతాళీ కవి, రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దమయంతి బెస్రా భాజపాలోకి చేరారు. వీరిని కేంద్ర నేతలు స్వాగతించారు.

 మార్పు తథ్యం

కటక్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన భర్తృహరి ఈ నెల 22న బిజద వీడిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో మూడుసార్లు సంసద్‌రత్న అవార్డులందుకున్న ఆయన తర్కంలో దిట్టగా అన్ని రాజకీయ పార్టీల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ ఒడియా దినపత్రిక ‘ప్రజాతంత్ర’ ప్రధాన సంపాదకునిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న భర్తృహరి బిజద వీడిన తర్వాత ఆ పార్టీ విలువలకు సమాధి కట్టిందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భాజపాలో చేరిన ఆయన మాట్లాడుతూ... ఈసారి ఎన్నికల్లో ఒడిశాలో మార్పు తథ్యమన్నారు. రాష్ట్రంలో మోదీ హవా కనిపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అన్నివర్గాల ఓటర్లు ఆకర్షితులయ్యారన్నారు. తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని, అవినీతి పాలనకు తెరదించనున్న ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారన్నారు.

 ఏ బాధ్యతిచ్చినా స్వీకరిస్తా

2009, 2014లలో జరిగిన ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో బ్రహ్మపుర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రముఖ ఒడియా సినీ హీరో సిద్ధాంత్‌ మహాపాత్ర్‌ను 2019 ఎన్నికల్లో బిజద నాయకత్వం పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. సిద్ధాంత్‌ చేతిలో వరుసగా రెండుసార్లు పరాజయం పాలైన చంద్రశేఖర్‌ సాహు 2019 ఎన్నికల ముందుగా కాంగ్రెస్‌ను వీడి బిజదలో చేరారు. ముఖ్యమంత్రి నవీన్‌ ఆయనకు బ్రహ్మపుర లోక్‌సభ అభ్యర్థిగా చేయడంతో విజయం సాధించారు. మరోవైపు గడిచిన అయిదేళ్లలో బిజద నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలకు సిద్ధాంత్‌ను ఆహ్వానించలేదు. దీంతో ఆవేదనకు గురైన ఆయన భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ పదేళ్ల పాలనా కాలంలో దేశానికి చేసిన సేవల పట్ల ఆకర్షితుడినై తాను తన వంతుగా పని చేయాలని భాజపాలో చేరానని, నాయకత్వం ఎలాంటి బాధ్యతలిచ్చినా నెరవేరుస్తానని చెప్పారు.

ఆమె రాష్ట్రపతి స్నేహితురాలు

మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌కి చెందిన గిరిజన మహిళ దమయంతి బెస్రా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్నేహితురాలు. జిల్లా కేంద్రం బరిపద కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. సంతాళీ కవిగా దేశవ్యాప్త మన్ననలందుకున్న దమయంతి ప్రముఖ రచయిత్రి. గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ప్రధాని మోదీ నిష్కళంక పాలన, అభివృద్ధి పనులు చూసి తాను భాజపాలో చేరినట్లు చెప్పారు. బోధన, సాహిత్యం, రచనల్లో ఇంతవరకు తలమునకలైన తాను ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ, ఆదివాసీ మహిళల ప్రగతి ఆశయంగా చేసుకుని భాజపాలో చేరినట్లు చెప్పారు.

ఈ ముగ్గురికీ టికెట్లు?

భాజపాలో చేరిన ఈ ముగ్గురికీ పార్టీ టికెట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. భర్తృహరికి మళ్లీ కటక్‌ స్థానం కేటాయిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 18 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన ఆ పార్టీ నాయకత్వం కటక్‌, జాజ్‌పూర్‌, కొంధమాల్‌ సీట్లకు పోటీ చేసేది ఎవరో ఇంకా ప్రకటించలేదు. సిద్ధాంత్‌కు గంజాం జిల్లాలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా చేసే సూచనలున్నాయి. దమయంతికి మయూర్‌భంజ్‌ జిల్లాలో అసెంబ్లీ సీటు కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని