logo

ఔత్సాహికం.. అల్లంతదూరం

ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది.

Published : 28 Mar 2024 04:16 IST

కొత్త పారిశ్రామిక వేత్తలకు కానరాని శిక్షణలు
మూడేళ్లుగా నిలిచిన ప్రక్రియ
న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

స్వయం ఉపాధి యూనిట్‌ వద్ద యువకులు (పాతచిత్రం)

ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. వారికి అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేడంతో కొత్త యూనిట్ల ఏర్పాటూ కలగానే మిగిలింది. ఈక్రమంలో గత ప్రభుత్వంలో నెలకొల్పిన యూనిట్లు నిర్వహణ కష్టసాధ్యంగా మారింది.

యువతకు ఉపాధి కల్పించేందుకు, వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈడీపీ(ఎంట్రన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం) కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించేవారు. 2018లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పరిశ్రమల స్థాపనకు సంబంధించి యువతకు అవగాహన సదస్సులు నిర్వహించేవారు. అనంతరం ఆసక్తి గలవారికి శిక్షణ ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం మారాక ప్రక్రియ మందగించింది. ఈలోపు కొవిడ్‌ రావడంతో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈక్రమంలో 2021 ఏప్రిల్‌ నుంచి పూర్తిగా ఆపేశారు.

నిధులు లేకే..

ఈడీపీ కార్యక్రమం నిర్వహణకు గతంలో పెద్దఎత్తున నిధులొచ్చేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలి. శిక్షణలకు వచ్చే వారికి భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి. సదస్సుల ఏర్పాటు ఖర్చు అదనం. కొన్నేళ్లుగా నిధులు ఆగిపోవడంతో అధికారులు సైతం ఏమీచేయలేకపోతున్నారు. గతేడాది నుంచి పూర్తిగా బడ్జెట్‌నే ఆపేశారు.

ప్రక్రియ సాగేదిలా..

ఎంపికైన వారిలో కనీసం 30 మంది లేక అంతకంటే ఎక్కువ మందిని ఒక గ్రూపుగా చేయడం.

మూడు రోజులు పాటు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం.

లీడ్‌ బ్యాంకు మేనేజర్‌(ఎల్‌డీఎం), ఇండస్ట్రియల్‌ ప్రమోషన్స్‌(పరిశ్రమల శాఖ), స్ఫూర్తిదాయక పారిశ్రామిక వేత్తలు), పరిశ్రమల కన్సల్టెంట్స్‌ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందించడం.

పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన రిజిస్ట్రేషన్‌ ప్రతిపాదన, మౌలిక వసతులు, అనుమతులు తెలియజేయడం

ప్రభుత్వ పథకాలు, రుణాలు, రాయితీలను వివరించడం.

మెలకువలు, ఉత్పాదన, ఎదురయ్యే సవాళ్లు, మార్కెటింగ్‌, స్వయం ఉపాధి, ఉద్యోగాల కల్పన తదితర అంశాలను చెప్పడం.


అనుమతులు వచ్చాయి..

ఈడీపీ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నుంచి రెండు వర్కు ఆర్డర్లు వచ్చాయి. అయితే ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రారంభించలేదు. త్వరలో చర్యలు తీసుకుంటాం. గతంలో హాజరైన 16 మందితో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించాం.

నీలం గోవిందరావు, ప్రబంధకుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని