logo

జలకలే

ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు.

Published : 28 Mar 2024 04:24 IST

న్యూస్‌టుడే-విజయనగరం అర్బన్‌

ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. ఇప్పటి వరకు 308 తవ్వగా.. రూ.1.98 కోట్లు చెల్లించినట్లు గణాంకాలు బట్టి తెలుస్తోంది. ఒక బోరు తవ్వకానికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. తొలుత నిధులు విడుదలలో జాప్యంతో డ్రిల్లింగ్‌ ఆలస్యమైంది.

హామీ

బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం.. అందుకు వైఎస్‌ఆర్‌ జలకళ పథకంలో రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తాం.. విద్యుత్తు పంపుసెట్‌ అమర్చుతాం.

ప్రభుత్వ ప్రకటన

పరిస్థితి

రైతుల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా, పథకం కింద లబ్ధిపొందిన వారు వందల్లో ఉంటున్నారు. అరకొరగా బోర్లు తవ్వారు. తవ్విన వాటికి విద్యుత్తు కనెక్షన్లు, మోటార్లు బిగించకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది.  విద్యుత్తు విషయంలో తొలుత రాయితీ  ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరి సమయంలో రైతులే భరించాలనడంతో ఆర్థిక భారంతో వెనకడుగు వేయాల్సి వస్తోంది. 

ప్రతిబంధకాలివే

  • ప్రారంభంలో పథకానికి 2.5-10 ఎకరాల భూమి కలిగిన రైతులకే అవకాశం కల్పించారు. దీంతో ఎక్కువ మంది రైతులు అనర్హులయ్యారు. తర్వాత 2.5 ఎకరాల కన్నా తక్కువైతే ఇద్దరు ముగ్గురు రైతులుంటే బోరు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
  • ఉమ్మడి జిల్లాలో అయిదు ఏజెన్సీలకు బోర్లు డ్రిల్లింగ్‌ చేసే బాధ్యతలు అప్పగించారు. వీటిలో రెండు ఏజెన్సీలు జిల్లాలోనివే. మిగిలిన మూడు ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాలకు చెందినవి ఉన్నాయి. ప్రారంభంలో నియోజకవర్గానికి ఒక రిగ్‌ లేకపోవడం, వర్షాలతో డ్రిల్లింగ్‌ పనులు కొంత నెమ్మదించాయి. తర్వాత బిల్లుల చెల్లింపులో జాప్యంతో ప్రైవేటు ఏజెన్సీలు తవ్వేందుకు నిరాకరిస్తూ వచ్చాయి.
  • డ్రిల్‌ చేసిన బోర్లకు విద్యుత్తు కనెక్షను ఇచ్చి, మోటారు అమర్చాలి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ (సీఆర్‌డీ), ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) దీనిని అమలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వమే రాయితీ ఇస్తామని చెప్పింది. తర్వాత దీనిని రైతులే భరించాలని చెప్పడంతో వారు ముందుకు రాలేదు. అందుబాటులో ఉన్న విద్యుత్తు సౌకర్యం బట్టి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు అవుతుందని అధికారులు చెబుతున్నారు.  
  • జిల్లాలో తొలివిడతగా 203 బోర్లకు విద్యుత్తు కనెక్షన్ల నిమిత్తం 2022లో ఈపీడీసీఎల్‌ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మోటార్లకు రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలుస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 373 బోర్లు తవ్వితే ఇందులో 40కి విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వీటికి మాత్రమే సబ్‌మెర్సిబుల్‌ పంప్‌సెట్లు మంజూరయ్యాయి.

నిబంధనలివీ..

  • పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి క్షేత్రస్థాయిలో వీఆర్వోలు అర్హతను నిర్ధారిస్తారు.
  • డ్వామా ఏపీడీ సిఫార్సు ఆధారంగా భూగర్భ శాస్త్రవేత్తలు (జియాలజిస్టులు) నీటి లభ్యతపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలి.
  • ఎంపిక చేసిన ఏజెన్సీలు బోర్లు వేస్తాయి.
  • డ్రిల్‌ చేసిన బోర్లకు విద్యుత్తు కనెక్షను ఇచ్చి మోటార్‌ అమర్చాలి.

జిల్లాలో పరిస్థితి

దరఖాస్తులు సుమారు: 10 వేలు
ఆమోదం : 1075
పరిపాలనా ఆమోదం పొందినవి: 373
వ్యయం: రూ.5.55 కోట్లు
డ్రిల్లింగ్‌ : 373
చెల్లింపులు : 308
మొత్తం : రూ.1.98 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని