logo

అయిదేళ్లు.. పరిశ్రమలు కుదేలు!

ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి.

Published : 18 Apr 2024 05:05 IST

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం చిన్నచూపు
ఉపాధి కోల్పోయిన జనపనార కార్మికులు
న్యూస్‌టుడే, బొబ్బిలి

అధికారంలోకి రాగానే పరిశ్రమలను తెరిపిస్తాం. కార్మికులకు ఉపాధి కల్పిస్తాం
.. అంటూ హామీలు గుప్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గాలికి వదిలేశారు.


అయిదేళ్లలో ఒక్క పరిశ్రమనూ తెరిపించలేదు. మూతపడ్డ పరిశ్రమల స్థలాలు ఇటీవల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. స్థిరాస్తి భూములుగా మార్చి స్థలాలు విక్రయిస్తున్నారు. ఫలితంగా పరిశ్రమల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వాటిని తెరిపించాలని కార్మికులు రోడ్డెక్కినా పోలీసు కేసులే తప్ప ఉపాధి దొరకలేదు. మరోవైపు జనపనార మిల్లుల్లో పనిచేసిన కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి మొత్తాలు రాక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

మ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. పలువురు మిల్లుల్లో ఉద్యోగాలతో జీవనం సాగించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహం లేక వరుసగా మూతపడ్డాయి. నెల్లిమర్ల, రాజాం, కొత్తవలస మినహా ఎక్కడా లేవు. అక్కడా వాస్తవ కార్మికుల సంఖ్య కంటే తగ్గించి నడిపిస్తున్నారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

మూతపడిన లక్ష్మీశ్రీనివాస జనపనార పరిశ్రమ  

పొట్టచేత పట్టుకుని..

విజయనగరం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాల్లో జనపనార పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సంఖ్య ఎక్కువ. ఒక్కో మిల్లులో నాలుగు వేల మంది వరకు పనిచేసేవారు. లక్ష్మీశ్రీనివాస, నవ్య, జ్యోతి, సింహాద్రి, హుగ్లీ వంటి పెద్ద పరిశ్రమలు ఉండేవి. ఆ ప్రాంతాల్లో వ్యాపారాలతో మరికొందరు ఉపాధి పొందేవారు. అవన్నీ మూతపడడంతో ఉపాధి కోసం కోస్తా జిల్లాలకు తరలిపోతున్నారు. జనపనార పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొంతమంది పెట్రోల్‌ బంకుల్లో, హోటల్లో, వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఉమ్మడి జిల్లాలో ఉండే ఏకైక పరిశ్రమ సాలూరులోని జీగిరాం జూట్‌ మిల్లు కూడా మూతపడడంతో వేల మంది ఉపాధి కోల్పోయారు.

అటకెక్కిన సాంకేతిక యంత్రాలు

జూట్ టెక్నాలజీ మిషన్లు అటకెక్కాయి. ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన గోగునారను ఉత్పత్తి చేసేందుకు పార్వతీపురం, బొబ్బిలిలో టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు చేశారు. గోగురైతుకు మద్దతు ధర, తద్వారా జనపనార పరిశ్రమలకు మేలురకమైన గోగును అందించేందుకు తలపెట్టారు. నిధులు వృథా అయ్యాయే తప్ప వాటిని వినియోగించలేదు. భవనాలు, రెట్టింగు ట్యాంకులు, గోదాములు నిర్మించినా అవి నిరుపయోగంగా మారాయి.

నిరుపయోగంగా జూట్ టెక్నాలజీ మిషన్‌ గోదాములు

పరిస్థితి ఇలా..

ఉమ్మడి జిల్లాలో జనపనార పరిశ్రమలు 16
ప్రస్తుతం నడుస్తున్నవి 6
పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నవారు 25 వేలు
మిల్లుల మూతతో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య 17 వేలు


తాపీ పనిచేసుకుంటున్నాం
 - గణపతి, కార్మికుడు, మల్లంపేట, బొబ్బిలి

జూట్ మిల్లులో పనిచేసే వాడిని. నెలకు రూ.8 వేలు వేతనం వచ్చేది. మూతపడడంతో బతుకులు రోడ్డున పడ్డాయి. తాపీ పనికి వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పని రోజూ ఉండడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఎలాంటి నోటీసులు లేకుండా మూసేశారు. 


పోరాడినా స్పందించలేదు..
- గోపాలం, కార్మికుడు  

పరిశ్రమలను కాపాడుకునేందుకు పోరాడినా స్పందన లేదు. మిల్లుల్లో వేతనాలు తక్కువైనా వాటిని నమ్ముకుని పనిచేశాం. చివరకు మూసివేయడంతో రోడ్డున పడ్డాం. దాచుకున్న పీఎఫ్‌ మొత్తాలు కూడా యాజమాన్యాలు చెల్లించడం లేదు. భూములను అమ్మి కార్మికుల నోళ్లను నొక్కేశారు.  


రోడ్డున పడేశాయి
- పి.శంకరరావు, సిటు జిల్లా అధ్యక్షుడు

పరిశ్రమల మూతతో కార్మికులను రోడ్డున పడేశారు. రావాల్సిన పీఎఫ్‌, ఇతర బకాయిలు ఇవ్వలేదు. కర్మాగారాలు మూసివేసి ఆయా భూములను యాజమాన్యాలు అమ్ముకున్నాయి. బకాయిలు చెల్లిస్తామని కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకున్నా చెల్లింపులు జరగలేదు. న్యాయం చేయాలి.


పాలకుల చేతగానితనం
- సురేష్‌, సీపీఎం నాయకుడు, బొబ్బిలి

పాలకుల చేతగాని తనం వల్లే ఈ ప్రాంతంలో జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. చాలా అవస్థలు పడుతున్నాం. కూలి పనులూ బయట దొరకడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. కార్మికుల ఓట్లు మాత్రం కావాలి. మా ఆకలి మంటను ఓటు ద్వారా చూపిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని