logo

ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది

‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా.

Published : 24 Apr 2024 05:16 IST

అన్ని స్థానాల్లో కూటమిదే జయకేతనం

 మహిళల చదువుతోనే ఆర్థికాభివృద్ధి

చంద్రబాబు నాయుడు తెదేపా అధినేత

‘నా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగి పోతోంది. ఇంత వరకు జరిగిన 43 సభల్లో ఎక్కడా కనిపించని ఉత్సాహం.. చైతన్యం మీలో చూస్తున్నా.. మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా మీరు చూపుతున్న అభిమానం.. ఆదరణ చూస్తుంటే ఎన్నికల కురుక్షేత్రంలో సింహాల్లా గర్జించి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు అన్ని అసెంబ్లీ, ఎంపీ సీట్లలో మనమే జయకేతనం ఎగురవేస్తామన్న పూర్తి నమ్మకం కలుగుతోంది.’

న్యూస్‌టుడే, బొండపల్లి,గజపతినగరం, గరివిడి, ఎస్‌.కోట, విజయనగరం అర్బన్‌: ‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. బాలికా శిశు సంరక్షణ పథకం కింద పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ సంక్షేమ నిధి ఏర్పాటు చేశా. గడిచిన అయిదేళ్ల జగన్‌ పాలనలో మీకు ఏమైనా మేలు జరిగిందా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొండపల్లిలో మంగళవారం మహిళలతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నాడు తాము చదువును ప్రోత్సహించి.. మీ పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నిస్తే జగన్‌ పాలనలో గంజాయిని ప్రోత్సహించి భావితరాన్ని చెడుమార్గం పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘నాసిరకం మద్యం తాగించి ఆడబిడ్డల తాళి తెంచుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల పాలన అవసరమా ఆలోచించండి. సంస్కరణల ద్వారా సంపదను సృష్టించే శక్తి తెదేపాకే ఉందన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అశోక్‌కు నమస్కరిస్తున్న బేబినాయన

మండుటెండలో మహిళోత్సాహం : గజపతినగరం/గరివిడి, న్యూస్‌టుడే: భగభగ మండుతున్న భానుడు.. నెత్తిన నిప్పుల కుంపటి అయినా వేలాది మంది మహిళలు తరలివచ్చారు. దీంతో బొండపల్లి వద్దగల జాతీయ రహదారి కిటకిటలాడింది. అడుగడుగునా బాబుకు బ్రహ్మరథం పట్టారు. అంచనాకు మించి అత్యధిక సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలు చాలక చాలా మంది బయట ఉండిపోయారు. సుమారు రెండు గంటల పాటు సభ ఉత్సాహంగా సాగింది. ముగిసే వరకు మహిళలంతా ఎంతో ఉత్సాహం చూపారు.

బొండపల్లిలో జరిగిన సదస్సుకు హాజరైన మహిళలు

ఘన స్వాగతం

చంద్రబాబు ఎస్‌.కోట నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బొండపల్లి సభాస్థలి సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, బొబ్బిలి, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థులు బేబినాయన, శ్రీనివాస్‌, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, కొండపల్లి కొండబాబు  స్వాగతం పలికారు.


గెలిపించండి..

వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే.
- కిమిడి నాగార్జున


కొండపల్లి, కలిశెట్టిని గెలిపించండి

‘పేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్‌ ఇచ్చాం.. ఆయన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.. ఒక పేద వ్యక్తిని ఎంపీ చేయాలని తెదేపా ఇస్తున్న గౌరవం ఇది.. కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం నియోజకవర్గానికి ఎన్నో సేవలందించారు. యువతను ప్రోత్సహించాలని ఈసారి ఆయన సోదరుడు కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే అప్పలనాయుడు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇస్తున్నా. శ్రీనివాస్‌, అప్పలనాయుడును భారీ ఆధిక్యతతో గెలిపించే బాధ్యత మహిళలంతా తీసుకోవాలని కోరారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నేతలు


కొండపల్లి కుటుంబం ఒక్కటైంది

నియోజకవర్గంలో కొండపల్లి కుటుంబం ఒక్కటైంది. బాబాయి కేఏ.నాయుడుతో వేదికను పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోంది. అంతా కష్టపడి విజయం వైపు అడుగులు వేసి సీఎంగా చంద్రబాబును అందలం ఎక్కిద్దాం.
- కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అభ్యర్థి


రాష్ట్రాభివృద్ధి జరగాలంటే..

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు అవసరం, ఆవశ్యకత ఉంది. అందుకు ప్రజలు ఆయన వెంట నడవాలి. అందరూ తెదేపా విజయానికి కృషి చేయాలి.
కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి


 అందరి సహకారం అవసరం

ఎన్నికల్లో యువతను ముందుకు నడిపిద్దాం. అందరం కలిసి రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. అందుకు రాజకీయాలకు అతీతంగా సహకారం అవసరం. - మర్రాపు సురేష్‌,జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాబుతోనే రామరాజ్యం అందరం సమష్టిగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రావణ రాజ్యాన్ని కూల్చి రామరాజ్యాన్ని స్థాపిద్దాం. ప్రతి ఒక్కరూ పది మందితో ఓట్లు వేసేలా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా.
 పావని, భాజపా రాష్ట్ర కార్యదర్శి


సీఎంను చేద్దాం

గతంలో చంద్రబాబు పాలనలో వెనుకబడిన నియోజకవర్గాన్ని జిల్లాలో మూడో స్థానానికి తీసుకువచ్చాం. మళ్లీ చంద్రబాబును సీఎం చేసి ప్రతి ఎకరాకూ నీరందేలా అభివృద్ధి చేసుకుందాం.
- కేఏ.నాయుడు, మాజీ ఎమ్మెల్యే


ప్రగతికి పాటుపడతాం: ‘గజపతినగరం నియోజకవం¦్గన్ని గతంలో ఎంతో అభివృద్ధి చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. ఎంఎన్‌ ఛానల్‌ను అభివృద్ధి చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. గతంలో కొండపల్లి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు పరిపాలనా అనుమతులిచ్చాం. ఈ ప్రభుత్వం పనులు చేయలేదు. మనం రాగానే పనులు పూర్తి చేసి బొండపల్లి మండలంలో నాలుగైదు గ్రామాలకు సాగునీరు అందిస్తామని’ చంద్రబాబు హామీ ఇచ్చారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు