logo

వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట

పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు.

Published : 10 May 2024 02:37 IST

పోలింగ్‌ వేళ ప్రలోభాలతో వైకాపా ఎర
మేనిఫెస్టో, గత ప్రగతిని నమ్ముకున్న కూటమి
ఈనాడు, విజయనగరం

పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. అమలుకు ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి అభ్యర్థులు మేనిఫెస్టో, సూపర్‌-6 పథకాలపై ప్రచారం చేస్తుండగా.. ప్రత్యర్థి వైకాపా మద్యం, మందుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది.  

ప్రలోభాలతో ఎర..

ఇప్పటికే అధికార పార్టీ ఓటర్లకు ప్రలోభాలతో ఎరేస్తోంది. నోట్లు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తోంది. ఈమేరకు గ్రామాల వారీగా నాయకులను ఎంపిక చేసింది. ఆ పార్టీ అధిష్ఠానం మూడు నెలల ముందే జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పైకం సిద్ధం చేసింది. నమ్మకస్తుడైన నాయకుల కనుసన్నల్లో ఎక్కడికక్కడే నిల్వ చేసింది. కోడ్‌ అమల్లోకి రాక ముందే మండలాల వారీగా తరలించింది. అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే నియోజకవర్గానికి సుమారు రూ.20 కోట్లు చేరవేసినట్లు సమాచారం. నామినేషన్లు వేసిన తరువాత అవసరమైన స్థానాలకు అదనంగా సమకూర్చింది. మరోవైపు అభ్యర్థులు సైతం రూ.80 లక్షల నుంచి రూ.కోటి విలువైన మద్యం రప్పించుకున్నారు. నాయకుల వద్ద, సమీప బంధువుల ఇళ్ల వద్ద నిల్వ చేసినట్లు తెలిసింది. తద్వారా ఓటర్లను మద్యం మత్తులో ముంచి ఓటు వేయించుకోవాలనుకుంటోంది.

  • కురుపాం నియోజకవర్గం ఒడిశా సరిహద్దులో ఉంది. ఈ నెల 11 నాటికి మద్యం చేరేలా వైకాపా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అక్కడ మద్యం అమ్మకాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. సారా ప్యాకెట్లు, ఛీప్‌ లిక్కర్‌ తీసుకురానున్నారు. భారీ వాహనాల పాత టైర్లలో పెట్టి అడ్డదారుల్లో దిగుమతి చేసుకోవాలని పథకం రచించారు. కాసుల కొరత లేదు. బీ పార్వతీపురం నియోజకవర్గంలో వైకాపా ముందు నుంచే కాసుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఓటుకు రూ.3 వేలకు తగ్గకుండా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఒకే వ్యక్తి మాటపై నిలబడే కుటంబాల్లో 70 మంది ఓటర్లు ఉన్నారని తెలుసుకొని రూ.2.10 లక్షలు అందజేసినట్లు ఆ ప్రాంతంలో అందరి నోట వినిపిస్తోంది. ఏ గ్రామంలో పర్యటిస్తారో... ముందు రోజే ఆయా ప్రాంతాలకు నగదు తరలించి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నగదు తరలింపునకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.
  • విజయనగరం నియోజకవర్గంలో వైకాపా నాయకులు అన్ని వ్యవహారాల్లోనూ ముందున్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. దేనికి ఎంత వెచ్చించాలో.. ఎవరికి ఎంతివ్వాలో కీలక నేత దర్శకత్వంలో ప్రత్యేక బృందాలు పాటిస్తున్నాయి. నగదు, మద్యం పంపిణీకి ఎక్కడా వెనుకంజ వేయకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. బీ సాలూరు నియోజకవర్గానికి అంతటా ఒడిశా సరిహద్దు ప్రాంతమే ఉంది. మద్యం తెద్దామా.. కాసులిచ్చేద్దామా అని వైకాపా నాయకులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.

బొబ్బిలి నియోజకవర్గంలో వైకాపా  ప్రాంతం, ఓటర్లను బట్టి రూ.500, రూ.1000, రూ.1500 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. వైకాపా మండలాల వారీగా ముందస్తుగానే బార్లు నుంచి మద్యం సైతం సిద్ధం చేసుకుంది. గజపతినగరం నియోజకవర్గంలో వైకాపా కాసుల పంపకం వ్యక్తులను బట్టి పంపిణీ ప్రారంభించినట్లు తెలిసింది.


  • రాజాం నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చినా మిగిలిన నియోజకవర్గాలతో పాటే సమానంగా నాయకత్వం అన్నీ సమకూర్చింది. అభ్యర్థి ప్రకటనకు ముందే ఆర్థిక సాయం అందించింది. ఇంకా అవసరమైతే జిల్లా పార్టీ బాధ్యుడికి సమకూర్చాలని ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
  • చీపురుపల్లి నియోజకవర్గంలో కాసులకు కొరత లేదు. ఓటర్లకు ఎంత పంపిణీ చేయాలో చెప్పి మండల, గ్రామ నాయకులకు అందజేసినట్లు తెలిసింది. ప్రస్తుతం గ్రామాల వారీ ఖర్చులకు ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. ఓటరు చేతిలో ఎంత పెట్టాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ నెల 10 లేదా 11 నుంచి శ్రీకారం చుడతారని తెలిసింది. మద్యం నిల్వ చేసినా అంతటా సర్దేందుకు చాలదని, డబ్బులు ఇచ్చేద్దామని సీనియర్‌ నాయకులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
  • ఎస్‌.కోట నియోజకవర్గంలో మద్యం సరఫరాకు సంబంధించి వైకాపా నాయకుడొకరు మూడు నెలల ముందే రూ.80 లక్షలు అడ్వాన్స్‌ చెల్లించినట్లు తెలిసింది. నగదు కూడా నమ్మకం ఉన్న నాయకుల వద్ద ఉంచినట్లు సమాచారం. కీలక నేత నుంచి సంకేతాలు అందిన వెంటనే పంపిణీకి శ్రీకారం చుడతారని తెలిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని