logo

అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా

ఆటో, మ్యాక్సీ క్యాబ్‌ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది.

Published : 10 May 2024 02:45 IST

వాహనమిత్ర పేరుతో ఇలా దోచేస్తావా
మళ్లీ నీకు ఓటేస్తే ఒట్టు

న్యూస్‌టుడే, విజయనగరం రింగురోడ్డు, పార్వతీపురం, కొమరాడ

ప్రభుత్వం చెప్పింది: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తాం.

చోదకుల నుంచి లాగేసింది: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 వేల వరకు ఆటోలు, క్యాబ్‌లు నడుస్తున్నాయి. ఒక్కొక్కరూ ఏడాదికి అన్ని రకాలుగా రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా సరాసరి రూ.44 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.220 కోట్లను తిరిగి చెల్లించారు. కానీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో లబ్ధిదారులకు ఇచ్చింది రూ.91 కోట్లు మాత్రమే. వాస్తవానికి చోదకుల నుంచి లాగేసింది ఇంకా ఎక్కువగానే ఉంటుంది.


 

ఏడాదికి పది వేలన్నావ్‌.. సంతోషించారు.. ఐదేళ్లలో యాభై వేలిస్తానన్నావ్‌.. పొంగిపోయారు.. అధికారంలోకి రాకముందు అనేక హామీలిచ్చావ్‌.. నమ్మేశారు.. ఓట్లేసి గెలిపించారు.. గద్దెనెక్కేవరకు తెలియలేదు వారికి.. ఆశ చూపి.. దోచేస్తావని తెలుసుకోలేకపోయారు.. వాహనమిత్ర పేరుతో మిత్రద్రోహం చేసి చోదకుల కడుపు కొట్టావ్‌.. యంత్ర సామగ్రి ధరలు పెంచేశావ్‌.. ఇంధన ఛార్జీల భారాన్ని మోపావ్‌.. పన్నులు, చలానాల పేరిట వేధించావ్‌.. ఈ ఐదేళ్లలో వారి నుంచి రూ.లక్షల్లో లాగేశావ్‌.. ఇది సాయమా.. ద్రోహమా.. ముమ్మాటికీ నమ్మక ద్రోహమే జగన్‌..

టో, మ్యాక్సీ క్యాబ్‌ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయాన్ని ప్రకటించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారి నుంచి ఏటా రూ.వేలల్లోనే నొక్కేస్తున్నారు. అధికారంలోకి రాగానే సొంత వాహనాలు ఉన్నవారికే అని నిబంధన విధించిన అన్న.. రిజిస్ట్రేషన్‌, చోదక అనుమతి పత్రం, విద్యుత్తు బిల్లు రూ.300 యూనిట్లు దాటకూడదు.. నవశకంలో కొన్ని షరతులను దీనికి వర్తింపజేయడంతో లబ్ధిదారులు భారీగా తగ్గిపోయారు.


క్కడ రోడ్డేస్తోంది నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఆటో చోదకులు. నెల్లిమర్ల నుంచి మొయిద వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉండేది. ఎక్కడికక్కడే గుంతలు దర్శనమిచ్చేవి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురయ్యేవి. అధికారులు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోలేదు. దీంతో గతేడాది జులై మొదటి వారంలో విరాళాలు పోగుచేసుకుని, స్థానిక యువత సహకారంతో రోడ్డేసుకున్నారు.

న్యూస్‌టుడే, నెల్లిమర్ల


పెట్రోల్‌తో మొదలు..

ఇతర ప్రాంతాల కంటే రాష్ట్రంలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.97 నుంచి రూ.100 వరకు ఉంది. ఇతర పక్క రాష్ట్రాల్లో రూ.90 లోపే లభిస్తోంది. ఇక్కడ అదనంగా రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుంటున్నారు. అంటే ఒక్కో చోదకుడు నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు.. ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు చెల్లిస్తున్నారు. కానీ వాహనమిత్ర నుంచి వచ్చేది రూ.10 వేలే. అప్పుడే అయిపోలేదు.. ఈ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా చేసుకోకపోతే రూ.5 వేలు కట్టాల్సిందే. లైసెన్సు లేకుంటే రూ.5 వేలు చెల్లించాలి. కోటు లేకపోయినా.. నిబంధనలు పాటించకపోయినా రూ.200 నుంచి రూ.1000 వరకు రుసుములివ్వాలి. ఇక రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, గ్రీన్‌ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లకు మరింత చెల్లించాలి. దీంతో పాటుగా అపరాధ రుసుములు ఎడాపెడా పెంచి, చోదకుల జేబులకు కన్నం వేశారు.


నెలకు రూ.వేల ఖర్చు

న్యూస్‌టుడే, సాలూరు: ఉమ్మడి జిల్లాలో రోడ్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణదారులు ఇంకా ఘోరం. దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆటోను షెడ్డుకు తీసుకెళితే రూ.500 నుంచి రూ.3 వేల వరకు పెట్టాల్సిందే. కొన్నిసార్లు ఇంకా అదనంగా చెల్లించాల్సిందే. దీంతో తమకు నగదు సాయం వద్దని, ముందు రోడ్లు బాగుచేయాలని చోదకులు కోరుతున్నారు. కలెక్టరేట్ల వద్ద ఇప్పటికే ధర్నాలు చేపట్టారు. కొందరు సొంతంగా రోడ్లేసుకున్నారు.


అన్నీ పెరిగాయ్‌..

న్నడూ లేనంతగా ఈ ఐదేళ్లలో ఆటో మొబైల్‌ రంగంలో ప్రతి యంత్రం, వస్తువు ధరలు అమాంతంగా పెరిగాయి. జీవనోపాధికి సంబంధించినవి కావడంతో చోదకులు కొనక తప్పదు. బోల్టు నుంచి చక్రాల వరకు ప్రియమయ్యాయి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌లు, తరచూ క్లచ్‌, గేర్‌ తీగల మార్పు, ఇంజిన్‌ ఆయిల్‌ మార్చడం, పన్నులు, జరిమానాలు, మెకానిక్‌ల ఖర్చులు ఇలా అన్ని విధాలుగా నష్టపోతున్నారు. వాహన మిత్ర పథకానికి ఎఫ్‌సీ(ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) తప్పనిసరి చేశారు. అధికారులను బట్టి ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. గతంలో రూ.1000 లోపే ఉండగా.. ప్రస్తుతం రూ.2500 నుంచి రూ.8000 వరకు లాగేస్తున్నారు. ఏటా ఇది పెరుగుతుంది. గ్రీన్‌ ట్యాక్స్‌ కట్టేవారు ఈ ధ్రువపత్రం పొందాలంటే రూ.5 వేల వరకు కట్టబెట్టాల్సిందే. గతంలో ఇది రూ.2 వేలలోపే ఉండేది. బీమా సైతం పెరిగింది. తెదేపా హయాంలో రూ.3 వేల నుంచి రూ.5,500 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు.


ఎలా బతకాలి..

వి, ఆటో చోదకుడు, విజయనగరం: నాకు ఇద్దరు ఆడ పిల్లలు. ఒక పాపకు మాత్రమే అమ్మఒడి పడింది. నాకు వాహనమిత్ర నగదు అందింది. ఏడాదిలో ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి రూ.23 వేలు వచ్చింది. పెరిగిన ధరలు, పాఠశాలల రుసుములు, ఆరోగ్య తనిఖీలు, ఆటో మరమ్మతులకు సంవత్సరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నా. ఈక్రమంలో అప్పులు చేశా. ప్రస్తుతం నాకొచ్చే మొత్తంతో వడ్డీలే కడుతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని