logo

సకల జనుల సంక్షేమానికే.. సూపర్‌-6

‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు..

Published : 10 May 2024 02:56 IST

మహిళలకు నెలకు రూ.1500..
ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
‘ఈనాడు’తో కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు

ఈనాడు, విజయనగరం

‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం.. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిలా ఉంది. ప్రధాని మోదీ, చంద్రబాబు సంపద సృష్టించి, ఆ ఫలాలు ప్రజలకు అందించగల సత్తా ఉన్న నేతలు. వారి మార్గదర్శకం.. అశోక్‌ గజపతిరాజు సూచనలతో నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకురావడమే నా ప్రధాన లక్ష్యమని’ కూటమి విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వివిధ అంశాలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే....  

మహిళలకు ఏటా రూ.18 వేలు

హిళలను సాధికారిత దిశగా నడిపిస్తాం. తెదేపా హయాంలోనే డ్వాక్రాతో పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. నా నియోజకవర్గంలో పది లక్షల మంది మహిళల్లో 2.8 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా చేస్తా. 19-59 ఏళ్ల వయసున్న అబలలకు నెలకు రూ.1500 చొప్పున సుమారు అయిదు లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. రోజుకు లక్ష మంది మహిళలకు ఉపయోగం. వనితలు చిన్న, కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం.  


ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు

ధినేత చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన వెంటనే పెట్టే రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు పైనే. చెత్త పన్ను రద్దు చేస్తాం. ఆస్తి పన్నుపై సమీక్షిస్తాం. మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం. భవన నిర్మాణ కార్మికులకు, ఆ రంగానికి ఊతమిస్తాం. ఈ అయిదేళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తాం.


రూ.4 వేలు పింఛను  

భివృద్ధి, సంపద సృష్టితోనే సంక్షేమం అమలు సాధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలు మంజూరు చేస్తాం. దీనిని ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తాం. పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. అందులోనే పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.  


డీఎస్సీపై తొలి సంతకం

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతారు. యువతకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తీసుకుంటున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. సింగిల్‌ విండో విధానంలో రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానిస్తాం. రాష్ట్రంలో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ మేరకు నియోజకవర్గంలో ఏటా వేలాది మందికి కొలువులు దక్కుతాయి.  


బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీ వర్గాల రక్షణకు మా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొస్తుంది. ఉప ప్రణాళిక కింద రాష్ట్రంలో రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తాం. ఆదరణ కింద ఆధునిక పరికరాలతో ఆయా వర్గాల్లో వెలుగు నింపుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం. బీసీ ఉప కులాల వారీగా అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కాపు కార్పొరేషన్‌ ద్వారా అత్యధికంగా ఉన్న ఈ సామాజిక వర్గం వారికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తా.


అన్ని వర్గాలకూ ఆదరణ  

కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ మెరుగైన జీవితం కల్పించేలా చర్యలు తీసుకుంటాం. యాదవులకు గొర్రెలు యూనిట్లు మంజూరు చేసి, వాటి రక్షణకు బీమా సదుపాయం కల్పిస్తాం. చేనేత వర్గాలకు పవర్‌లూమ్‌ వినియోగం కింద 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్‌లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. ప్రతి కుటుంబానికీ రూ.24 వేల ఆర్థికసాయం ఇచ్చి ఆదుకుంటాం. నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తాం. రజకుల దోబీఘాట్ల నిర్మాణాల కోసం ప్రోత్సాహం అందిస్తాం. విద్యుత్తు ఛార్జీల్లో రాయితీలు కల్పిస్తాం. ఎస్టీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా వారి కోసమే వెచ్చించనున్నాం. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెన, ఫీజు రీయంబర్స్‌, ఎస్సీ, ఎస్టీలకు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు తీసుకొస్తాం.


ప్రాజెక్టులు నిర్మిస్తాం.. పరిశ్రమలు తెరిపిస్తాం..

నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి, మడ్డువలస, తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి అదనపు నిధులు తీసుకొస్తా. మూతపడిన చక్కెర, జూÆట్‌ పరిశ్రమలు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రధాన రహదారుల విస్తరణ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి చేయిస్తా. రైల్వే పైవంతెనలు నిర్మించేందుకు ప్రయత్నిస్తా. విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తా. తెదేపా హయాంలో అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు రూ.5 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తాం.  


అన్నదాతలకు ఏటా రూ.20 వేలు  

మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులందరికీ ప్రభుత్వ సాయంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వెయ్యి ఎకరాల్లో సేంద్రియ సాగు చేసే వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్‌ అంశాల్లో సాయమందిస్తాం. పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తాం. అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. తద్వారా నియోజకవర్గంలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తాం. విత్తనాలు, ఎరువులు రాయితీపై అందిస్తాం.


ఒక్కో బిడ్డ చదువుకు రూ.15 వేలు

‘అమ్మకు వందనం’ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఏటా రూ.15 వేలు చొప్పున, ఎంత మంది పిల్లలు ఉంటే అందరి పేరిట తల్లులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 2.47 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. నిత్యావసర సరకులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారాన్ని తగ్గిస్తాం. వైకాపా ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజలు కోలుకోలేకుండా బాదేసింది. అధికారంలోకి వచ్చాక వాటిని నియంత్రిస్తాం. సుమారు 21 లక్షల మందికి మేలు చేస్తాం. నియోజకవర్గంలో ఆరున్నర లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం.


ప్రతి నెలా ఒకటినే జీతాలు

ద్యోగ, ఉపాధ్యాయులకు మా ప్రభుత్వంలో గౌరవం దక్కేలా చూస్తాం. పూర్తి అనుకూల వాతావరణంలో పనిచేసేలా అవకాశం కల్పిస్తాం. ప్రతి నెలా ఒకటో తేదీకే జీతాలు, పింఛన్లు చెల్లిస్తాం. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తాం. మెరుగైన పీఆర్సీ అమలు, ప్రభుత్వం రాగానే ఫిట్మెంట్‌ ప్రకటించేలా చర్యలు తీసుకుంటాం. పింఛనర్ల బకాయిలు చెల్లింపునకు ఏర్పాట్లు చేస్తాం. పింఛనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వంలో నిర్ణయించి చర్యలు తీసుకుంటాం. అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు  పథకాలు వర్తించేలా చూస్తాం.  వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలు చొప్పున అందిస్తాం.


మైనార్టీలకు భరోసా

ముస్లిం మైనార్టీలకు తెదేపా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈద్గాలు, ఖబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. వైకాపా రద్దు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తాం. ఇమామ్‌లకు ప్రతీ నెలా రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఆర్థిక సాయం చేస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం ఇస్తాం. మైనార్టీల రక్షణకు ప్రత్యేక చర్యలు
తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని