logo

అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు

అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్‌ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు.

Updated : 10 May 2024 07:03 IST

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ, రింగురోడ్డు

అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్‌ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు.. వారి పోరాటాలు పెద్దఎత్తున జరిపారు. ప్రభుత్వం మాత్రం మళ్లీ బూటకపు హామీలిచ్చి.. నామమాత్రపు జీవోలతోనే పోరాటాలను అణచివేసింది.. ఇప్పుడు వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.. ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామంటున్నారు.

అంగన్‌వా‘ఢీ’లు

పోరాటం: 42 రోజుల సమ్మె
రెండు జిల్లాల్లో వీరి సంఖ్య: 7,660

అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబరు 11 నుంచి 2024 జనవరి 23 వరకు 42 రోజులు సమ్మె నిర్వహించారు. 12 డిమాండ్లలో జీతం పెంపు, పింఛనుతో కూడిన పదవీ విరమణ ప్రోత్సాహకాలు ప్రధానమైనవి. వీటికి ప్రభుత్వం జీవోలివ్వలేదు. మూడు జీవోలు మినహా మిగిలిన డిమాండ్లకు హామీలతోనే సరిపెట్టింది. సమ్మె కాలంలో కేంద్రాలు మూతపడడంతో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు సేవలు నిలిచిపోయాయి. ఎస్మాను ప్రయోగించినా డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం సాగించారు.


జూనియర్‌ డాక్టర్లు

నిరసన: 2023 డిసెంబరు 28
డిమాండ్‌: స్టైఫండ్‌ బకాయిలు
పనిచేస్తున్న వారు 128
ఏడు నెలలుగా చెల్లించాల్సిన స్టైఫండ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని జూనియర్‌ డాక్టర్లు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పది రోజుల పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. రాత్రనక, పగలనక విధులు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని, మండల వైద్య కేంద్రాలకు మహిళా వైద్యులను రాత్రి విధులకు పంపించడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.


ప్రభుత్వ పెన్షనర్లు

ధర్నా: 2024 జనవరి 29
డిమాండ్‌ : డీఏ, ఎరియర్స్‌ చెల్లించాలి
పనిచేస్తున్న వారు: 27 వేల మంది

ప్రభుత్వ ఫించనుదార్లంతా  70-75 సంవత్సరాలు నిండిన వారికి గతంలో సాధించుకున్న అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛనును 15 శాతానికి పెంచాలని, 2018 నుంచి పెంచిన డీఆర్‌ ఎరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2022 నుంచి అమలు చేసిన 11వ పీఆర్‌సీ తర్వాత ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలని, ఆరోగ్య కార్డు ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని కోరారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పరిధి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, దహనం ఖర్చులు సమయానికి ఇవ్వాలని, ట్రెజరీల ద్వారా చెల్లింపులు జరపాలని కోరారు.


సమగ్రశిక్షా ఉద్యోగులు

సమ్మె చేసిన రోజులు:22
డిమాండ్‌: హెచ్‌.ఆర్‌.పాలసీ
పనిచేస్తున్న వారు: 1780

సమగ్రశిక్షా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు డిసెంబరు 20 నుంచి జనవరి పదో తేదీ వరకు సమ్మె నిర్వహించారు. 16 డిమాండ్లలో ఒక్కటీ  నెరవేరలేదు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు డిమాండ్లలో ప్రధానమైనవి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వర్తింపుచేయాలని,  ప్రస్తుతం ఉన్న పార్ట్‌టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్‌టైమ్‌ ఒప్పంద విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి జిల్లాలో ఉన్నా న్యాయం చేయలేకపోయారు.


రోడ్డెక్కిన వీఆర్యేలు

నిరసన తెలిపిన తేదీ: కలెక్టరేట్‌ 2023 డిసెంబరు 28
ప్రధాన డిమాండ్‌ : పేస్కేలు అమలు చేయాలి
పనిచేస్తున్న వారు: 968
గ్రామ రెవెన్యూ సహాయకులు పోరాడి సాధించుకున్న డీఏ మొత్తాన్ని ప్రభుత్వం  తిరిగి రికవరీ చేసిన నిరంకుశ చర్యను దుయ్యబట్టారు. వీఆర్‌ఏలకు సంబంధం లేని పనులను చేయించి శ్రమదోపిడీ చేయడాన్ని ఖండించారు. రూ.26 వేలు వేతనం ఇవ్వాలని, తెలంగాణ తరహాలో పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన డీఏను వేతనంతో కలిపి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఎల్వో విధుల నుంచి మినహాయించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని