logo
Published : 30 Jun 2022 02:02 IST

పగలు వ్యాపారం.. సాయంత్రం దోపిడీలు

 నలుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న కనిగిరి సీఐ బి.పాపారావు..ఎస్సైలు ప్రసాద్‌, రమేష్‌బాబు, కాశీ విశ్వనాథరెడ్డి, ప్రేమ్‌కుమార్‌

కనిగిరి, న్యూస్‌టుడే: ఆ నలుగురు పగటి వేళల్లో రోడ్లపై రంగురాళ్ల ఉంగరాలు, కళ్లజోళ్లు, టోపీలు విక్రయిస్తుంటారు. సాయంత్రమయ్యేసరికి శివారు ప్రాంతాల్లో ఒంటరిగా యజమాని ఉన్న దుకాణాల్లోకి ప్రవేశిస్తారు. వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి గల్లాపెట్టెలోని సొమ్ము లాక్కొని ఉడాయిస్తుంటారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కనిగిరిలో సీఐ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, చార్మినార్‌, ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి ప్రాంతాలకు చెందిన సల్మాన్‌ హుస్సేన్‌, అబుతరబ్‌, ఫయాజ్‌అలీ, సయ్యద్‌ జాఫర్‌ మిత్రులు. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై కళ్లజోళ్లు, ఉంగరాలు వంటివి అమ్ముతుంటారు. అప్పుడప్పుడు కదిరి పట్టణంలోని ఓ గదిలో కలుసుకుంటుంటారు. ఈ నలుగురు మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై పొన్నలూరు మండలం అగ్రహారంలో ట్రాక్టర విడి పరికరాల దుకాణం వద్దకు వెళ్లారు. ఇద్దరు బయట ఉండగా మరో ఇద్దరు దుకాణంలోకి ప్రవేశించి ఫిల్టర్‌ ఇవ్వమని అడిగి అక్కడున్న మహిళా యజమానికి రూ.500 ఇచ్చారు.. తిరిగి చిల్లర తీసుకునే క్రమంలో సల్మాన్‌ హుస్సేన్‌ గల్లా పెట్టెలోని రెండు నగదు బ్యాగులను బలవంతంగా లాక్కొన్నాడు. ఆమెను బెదిరించి ఉడాయించారు. ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు కనిగిరి, పీసీపల్లి, వెలిగండ్ల, పొన్నలూరు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పాటై నిఘా పెట్టారు. పీసీపల్లి మండలం గంగ దేవాలయం వద్ద కారును పోలీసులు రోడ్డుకు అడ్డుగా పెట్టారు. దీంతో సల్మాన్‌, అబుతరబ్లు తమ వాహనాన్ని పొలాల్లో పడవేసి వెంగళాపల్లి చేరుకోగా గ్రామస్థులు పట్టుకొని పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబుకి అప్పగించారు. సయ్యద్‌ జఫర్‌ను స్థానికులు, ఫయాజ్‌ అలీని పామూరు రోడ్డులోని టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష నగదు, చరవాణులు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లోనూ ఇదే తరహా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts