logo

ఆలయానికి వెళుతూ... కానరాని లోకాలకు

రహదారిపై గుడికి వెళుతున్న గురుస్వామిని ఓ టూరిస్టు బస్సు తాకడంతో గాయపడి మృతి చెందిన సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. 

Published : 01 Dec 2022 03:06 IST

వెంకట సుబ్బారావు ( పాతచిత్రం)

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: రహదారిపై గుడికి వెళుతున్న గురుస్వామిని ఓ టూరిస్టు బస్సు తాకడంతో గాయపడి మృతి చెందిన సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు..అయ్యప్పస్వామి దేవాలయంలో గురుస్వామిగా పూజలు అందిస్తున్న దేసు వెంకటసుబ్బారావు (56)  బుధవారం వేకువజామున ఇంటి నుంచి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన అయ్యప్పమాలధారులను శ్రీశైలానికి తీసుకుని వెళుతున్న యాత్రికుల బస్సు ఆయన వెనుక భాగానికి తగిలింది. తలకు గాయమై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.

పెళ్లి రోజునే మృత్యువాత : పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు శీతల పానీయాల దుకాణం నిర్వహిస్తున్న వెంకటసుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. సుబ్బారావు 23 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. అయ్యప్ప దేవాలయంలో ప్రధాన గురుస్వామిగా ఉంటూ పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం తన పెళ్లి రోజని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారులకు భిక్ష అందిస్తానని మంగళవారం చెప్పారు. బుధవారం ఉదయం దేవాలయానికి చేరుకోక ముందే ఆయన మృత్యువాత పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుటుంబ పెద్ద విగత జీవిగా మారడటంతో ఆ కుటుంబసభ్యుల ఆవేదన అంతాఇంతా కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని