logo

పసుపు.. పెట్టుబడీ దక్కలేదు

ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు.

Published : 26 Mar 2023 02:16 IST

ఉడకబెట్టిన దుంప పసుపు

కంభం, బేస్తవారపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు. పైరు మొలక దశ దాటిన తర్వాత అధిక వర్షాలు కురవడంతో దుంప పుచ్చు, కుళ్లు తెగుళ్లు సోకి దిగుబడులపై ప్రభావం చూపింది. ఈ సంవత్సరం జిల్లాలో 1100 ఎకరాల్లో పంట సాగైంది. 2022తో పోల్చితే నాలుగు వందల ఎకరాలు తగ్గింది. అత్యధికంగా గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు, రాచర్ల, సీఎస్‌ పురం, పామూరు, కనిగిరి, అద్దంకి తదితర మండలాల్లో సాగు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో గత యేడాది 800 ఎకరాల్లో సాగు చేస్తే ఈసారి 580 ఎకరాలకే పరిమితం.

* పెరిగిన సాగు ఖర్చులు: పసుపు దీర్ఘకాలిక పంట కావడంతో పెట్టుబడులు అధికం, ఆదాయం తక్కువగా ఉంటోంది. దాంతో ఏటికేడు సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు బేస్తవారపేట మండలం సోమవారపేట, చింతలపాలెం తదితర గ్రామాల్లో వంద ఎకరాలకు పైగా పండించేవారు. ప్రస్తుతం పది ఎకరాలలోపే వేశారు. విత్తనాలు, సేద్యం, కూలీలు, కలుపు ఏరివేత, ఎరువులు, పురుగు మందుల వాడకం, తవ్వకాలు, ఉడకబెట్టడం తదితర ఖర్చులు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు అవుతున్నాయి. బాగా పండితే 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం 15 క్వింటాళ్ల లోపే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, ద]గ్గరలో మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేయడంతో పంటంతా మధ్య దళారులకు క్వింటా రూ.5 వేల చొప్పున అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాదైనా త్వరగా వీటిని ఏర్పాటుచేసి రైతు వద్ద ఉన్న పసుపును కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

క్వింటాకు రూ.8 వేలు ఇవ్వాలి

పసుపు సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ప్రభుత్వమే క్వింటా రూ.8 వేల ధరతో కొనుగోలు చేయాలి. మూడేళ్ల నుంచి గిట్టుబాటు కాలేదు. నేను 60 సెంట్లలో సాగు చేస్తే రూ.65 వేలు ఖర్చుకాగా కేవలం 5 క్వింటాళ్లు వచ్చింది. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.     -పుండరీబాబు, రైతు, సోమవారపేట


త్వరగా తీసుకోవాలి

ఈ ఏడాది అర ఎకరా పొలంలో పంట సాగు చేశాను. సుమారు 60 వేలు ఖర్చయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు తీసుకోవాలి. పంటను దాచుకునే వసతులు లేవు. -వెలుగోడు శ్రీను, రైతు


ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంట చేతికి వచ్చిన తర్వాత 15 రోజుల పాటు ఉత్పత్తులు ఉడకబెట్టడం, బాగు చేసుకోవడానికి పడుతుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ.6,850 నిర్ణయించింది. కంభం, గిద్దలూరు, కనిగిరిలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయి.  - హరికృష్ణ, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని