logo

ప్రజా చైతన్యం.. పోరాటాలతోనే ప్రాజెక్టుల పూర్తి

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తిచేస్తుందనే విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని..

Published : 30 Mar 2023 02:33 IST

చిత్రపటాన్ని చూపుతూ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకుడు తులసిరెడ్డి..
చిత్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తిచేస్తుందనే విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని.. ప్రజా చైతన్యం, పోరాటాలతోనే పురోగతి సాధించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి- వెలిగొండ ప్రాజెక్టు’ అనే అంశంపై ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో బుధవారం సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎన్‌.తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు సాగు, తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించి త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణం పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. అలాంటి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అధ్యయన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు కేశవరావు, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, ఆ పార్టీ నాయకుడు ఈదర హరిబాబు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి.. వాటిని పూర్తిచేయకుంటే భవిష్యత్తులో వాటిల్లే ముప్పు వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని