రోజంతా ఉత్కంఠ
టంగుటూరు మండలం రావివారిపాలెంలో తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్‌వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ (50) హత్యోదంతంతో ఒంగోలులో రోజంతా ఉత్కంఠ నెలకొంది.
పరారీలో హనుమాయమ్మ హత్యకేసు నిందితుడు
జీజీహెచ్‌లో తెదేపా నేతల ఆందోళన
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, చిత్రంలో ఎమ్మెల్యే స్వామి
ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు - న్యూస్‌టుడే: టంగుటూరు మండలం రావివారిపాలెంలో తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్‌వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ (50) హత్యోదంతంతో ఒంగోలులో రోజంతా ఉత్కంఠ నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో బాధిత కుటుంబీకులు, వారి బంధువులు, తెదేపా కార్యకర్తలు జీజీహెచ్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. హత్య చేసిన తర్వాత నిందితుడు గ్రామంలోనే ఉన్నప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధమవ్వగా... ఆసుపత్రి ప్రధాన ద్వారాలు మూసేసి పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
పోలీసుల తీరుపై విమర్శలు...
అడ్డుకోవడంతో సీఐని నిలదీస్తున్న రోదిస్తున్న హనుమాయమ్మ కుమార్తె మాధురిని ఓదార్చుతున్న సోదరుడు
టంగుటూరులో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలు పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వాటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోటాపోటీ ప్రదర్శనలను అంచనా వేయలేకపోవటం, ఇద్దరు నేతలను గృహనిర్భంధం చేసి ఉద్రిక్తతలను నిలువరించడంలో పోలీసు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైకాపా కన్వీనర్‌ను గృహనిర్భంధం చేసినట్లు పోలీసులు ప్రకటించిన తర్వాత... ఆయన రోడ్డుమీద ఎలా ప్రత్యక్షమయ్యారన్న చర్చ సాగుతోంది. లోపాయికారీగా వ్యవహరించి అధికారపార్టీకి సహకరించడంతోనే ఉద్రిక్తతలు తలెత్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో హనుమాయమ్మ హత్య జరిగినా... నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు ట్రాక్టర్‌తో సహా సమీపంలోని మామిడి తోటలోనే ఉన్నట్లు తెలిసింది. గ్రామంలోకి వెళ్లిన పోలీసులకు నిందితుడ్ని పట్టిస్తామని స్థానికులు చెప్పినా... తమకు అధికారులు సూచించలేదని బదులిచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత నిందితుడు పరారవ్వగా... హత్యకు వినియోగించిన వాహనాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సత్వరం స్పందించి నిందితుడ్ని పట్టుకుని ఉంటే... మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేవి కావన్న వాదన వినిపిస్తోంది.
కన్నెత్తి చూడని ఐసీడీఎస్ అధికారులు
టంగుటూరు బొమ్మల కూడలిలో నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు
హనుమాయమ్మ అంగన్‌వాడీ కార్యకర్త. ప్రభుత్వ శాఖలో గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారు. అటువంటి మహిళ దారుణ హత్యకు గురైనా... సదరు శాఖ నుంచి స్పందన లేదు. స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెందిన అధికారులు ఎవరూ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందనే చర్చ సాగుతున్న నేపథ్యంలో... సదరు కుటుంబాన్ని పరామర్శిస్తే అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయని వారు దూరంగా ఉన్నట్లు సమాచారం.
వరికూటికి మద్దతుగా వైకాపా...
తాజా వివాదాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో వైకాపా నియోజకవర్గ కన్వీనర్ వరికూటి అశోక్‌బాబుకు మద్దతుగా వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయంటూ కొండపి ఎమ్మెల్యే శ్రీబాలావీరాంజనేయ స్వామిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరనన తెలిపేందుకు అశోక్‌బాబు ప్రయత్నిస్తే... పోటీ ప్రదర్శనతో రాద్ధాంతం చేశారని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కన్వీనర్ ఆమంచి కృష్ణమోహన్‌లు వీడియో ప్రకటనలు విడుదల చేశారు. అదే సమయంలో రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ దారుణ హత్య విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
కఠినంగా శిక్షించాలని ఆందోళన
హనుమాయమ్మను అత్యంత క్రూరంగా ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ సీఐటీయూ, అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టంగుటూరు పురం సెంటర్ నుంచి బొమ్మల కూడలి వరకు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై.సత్యవతి కోరారు. సీఐటీయూ నాయకులు టి.రాము, వి.మోజస్, కె.శ్రీనివాస్, అంగన్‌వాడీ కార్యకర్తలు చిరంజీవి, శ్రీదేవి, లక్ష్మీ, అంకమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి వద్ద తెదేపా శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా... ప్రశాంత రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడి రాజకీయం పొరుగు జిల్లాల శైలికి పూర్తిగా భిన్నం. ఆవేశకావేశాలు... సవాళ్లూ, ప్రతిసవాళ్లూ ఏమీ ఉండవు. అంతా హుందాగా సాగుతుంది. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో వర్గపోరు ఉండేది. జిల్లాల విభజన తర్వాత రాజకీయంగా ఆ సమస్యా లేదు. అటువంటి జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. కొందరు నాయకుల వ్యక్తిగత వ్యవహారశైలి శాంతిభద్రతల సమస్యకు కారణమవుతోందన్న చర్చ జరుగుతోంది.
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం
అభద్రతా భావంతోనే...
కొండపి రాజకీయం కలహాల కాపురంలా మారింది. ఇక్కడి నాయకులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దూకుడు రాజకీయం అని భావిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన కొండపిలో ఎన్నడూ ఈ తరహా సంస్కృతి లేదు. అంతకుముందూ హుందాగానే సాగిన రాజకీయ వాతావరణం ఇప్పుడు గాడితప్పిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వైకాపా నియోజకవర్గ కన్వీనర్ వరికూటి అశోక్‌బాబు, అదే పార్టీకి చెందిన పీడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు డాక్టర్ మాదాసి వెంకయ్య వర్గాల మధ్య వైరం రోజురోజుకీ ముదురుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు స్థాయి దాటి... మహిళా నేత ఇంటికి వెళ్లి భౌతికదాడులకు సైతం పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. వరికూటి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వెంకయ్య వర్గం పదేపదే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతోంది. ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుటే ఆందోళనకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. దీనికి తోడు వరికూటి అశోక్‌బాబు... విపక్ష తెదేపాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిపై పదేపదే కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏకంగా ఆయన నివాసం ముట్టడికి పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఆధిపత్య పోరులో తనకు టిక్కెట్ దక్కుతుందో లేదోనన్న అభద్రతాభావంతోనే ఆయన ఈ తరహా రాజకీయాలకు తెరతీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కావాలనే కయ్యానికి వెళ్తూ...
స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే స్వామి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని అశోక్‌బాబు ఆరోపిస్తున్నారు. అటువంటిదేమైనా ఉంటే వాటిపై నేరుగా జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసే వీలుంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో చర్చ జరిగేలా చూడొచ్చు. ఆధారాలు ఉంటే నేరుగా దర్యాప్తు చేయించొచ్చు. అధికార పార్టీకి చెందిన నేత కాబట్టి ఆయనకు ఉండే వెసులుబాట్లు చాలానే ఉంటాయి. ఈ అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా ‘చెంబు మార్చ్’ పేరిట ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే ఇంటిపైకి ఇదే తరహాలో రావడంతో తెదేపా శ్రేణులు సైతం ఈ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీ ఆందోళనకు దిగాయి. దీంతో విషయం చేయిదాటింది. ఇరువర్గాలను నియంత్రించాల్సిన పోలీసులు ‘వ్యూహాత్మకం’గా విఫలమయ్యారు. దీంతో టంగుటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో రావివారిపాలెంలో మండల తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. దీనివెనుక రాజకీయ వైరం ఉందని తెదేపా ఆరోపిస్తోంది. వెరసి జిల్లాలో ఎక్కడాలేని విధంగా కొండపిలో ఫ్యాక్షన్ రాజకీయం నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాలో ఈ తరహా రాజకీయం సమంజసం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలూ ఇదే పంథా అనుసరిస్తే రానురానూ శాంతిభద్రతల పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.