logo

తీరంలో.. ఇసుక దోపిడీ!

ఈ చిత్రాల్లో.. మొదటిదేమో వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట తీర భూముల్లో ఇసుక తవ్వకాలతో ఏర్పడి భారీ నీటి కుంటలు.. వేళ్లతో సహా బయటపడి కూలిపోతున్న జీడి వృక్షాలనూ చూడొచ్చు.. రెండో చిత్రంలో కన్పించేది మంచినీళ్లపేట తీర అటవీ భూముల్లో నిల్వ చేసిన ఇసుక కుప్ప. తీర ప్రాంతాలను ఛిద్రం చేస్తూ అక్రమార్కులు ఎంతలా ఇసుకను తవ్వి డంపింగ్‌ చేసి తరలిస్తున్నారో.. ఈ చిత్రాలే చెబుతున్నాయి..

Published : 24 Jan 2022 03:27 IST

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే

ఈ చిత్రాల్లో.. మొదటిదేమో వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట తీర భూముల్లో ఇసుక తవ్వకాలతో ఏర్పడి భారీ నీటి కుంటలు.. వేళ్లతో సహా బయటపడి కూలిపోతున్న జీడి వృక్షాలనూ చూడొచ్చు.. రెండో చిత్రంలో కన్పించేది మంచినీళ్లపేట తీర అటవీ భూముల్లో నిల్వ చేసిన ఇసుక కుప్ప. తీర ప్రాంతాలను ఛిద్రం చేస్తూ అక్రమార్కులు ఎంతలా ఇసుకను తవ్వి డంపింగ్‌ చేసి తరలిస్తున్నారో.. ఈ చిత్రాలే చెబుతున్నాయి..

జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇందులో అత్యధికంగా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. ఇక్కడ హుకుంపేట, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట, అమలపాడు, కొత్తపేట, కొమరల్తాడ, దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు, కిడిసింగి, డోకులపాడు, చినవంక, బాతుపురం, అక్కుపల్లి, గుణుపల్లి, మెట్టూరు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల తీర భూములున్నాయి. వీటిలో కొన్ని అటవీ శాఖ అధీనంలో ఉండగా.. ఎక్కువ శాతం భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో హుకుంపేట, మంచినీళ్లపేట మధ్య తీర అటవీ భూముల నుంచి ఇసుక అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది.


30 అడుగుల లోతుకు తవ్వకాలు..

ఇసుక మాఫియా తీర ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల లోతు మేర ఇసుకను తవ్వేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యల్లో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. భారీ తవ్వకాలతో తీరం రూపురేఖలు కోల్పోతోంది. ఇక్కడ సాగవుతున్న మడ అడవులు, సరుగుడు, నీలగిరి, జీడి చెట్లు నేల కూలుతున్నాయి. ఈ కలపను సైతం ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ఇటు అటవీ, అటు రెవెన్యూ అధికారుల చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి.


ఇదో రకం అక్రమం..
ఈ ప్రాంతంలో జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. మరో వైపు జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అదనుగా చేసుకొని కొందరు ఈ దందాకు తెర లేపారు. ఇక్కడ ఒక ట్రాక్టరు ఇసుక లోడును రూ.1,000 నుంచి 1,500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నది నుంచి వచ్చే సాధారణ ఇసుకను లారీల ద్వారా తెచ్చి నిల్వ చేస్తున్నారు. అచ్చం నది ఇసుకలా ఉండే సముద్ర ఇసుకను అందులో కొంత కలిపి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఇలా కలిపిన ఇసుకను ట్రాక్టరు లోడు రూ.6,500 నుంచి రూ.8 వేల మధ్య అమ్ముతున్నారు. ఈ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇటు తీరం నష్టపోవడంతోపాటు, అటు ఈ ఇసుకతో నిర్మించిన భవనాలూ తొందరగా దెబ్బతినే అవకాశమూ ఉంటుంది.


నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తాం
- రాజు, అటవీ సెక్షన్‌ అధికారి, టెక్కలి రేంజ్‌

తీర అటవీ భూముల్లో నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిపై ఇది వరకే కొందరిపై కేసులు నమోదు చేశాం. అయినా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గట్టి నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకుంటాం. వ్యాపారులను పట్టుకొని కేసులు నమోదు చేస్తాం.


కఠిన చర్యలు తీసుకుంటాం
- బి.అప్పలస్వామి, తహసీల్దార్‌, వజ్రపుకొత్తూరు

తీర అటవీ భూముల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాలపై ఆయా ప్రాంత వీఆర్వోలు, వీఆర్‌ఏలతో పర్యవేక్షణ చేస్తాం. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా కఠిన చర్యలు చేపడతాం. ఈ విషయం కలెక్టరు దృష్టికి తీసుకెళతాం. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తవ్వకాలు అడ్డుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని