logo

నైపుణ్యం ఉంటే.. కొలువు మీదే..

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల జోరు తగ్గింది. గతంలో ఈ సమయానికి పలు సంస్థలు వందల మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది.

Published : 06 Feb 2023 06:29 IST

అంబేడ్కర్‌ వర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల జోరు తగ్గింది. గతంలో ఈ సమయానికి పలు సంస్థలు వందల మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 43 శాతం నియామకాలు తగ్గిపోయాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం భయంతో ప్రస్తుతం ఐటీ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతూ కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారిలో నైరాశ్యం నెలకొంది. కానీ ప్రస్తుత అవసరాలకు తగిన నైపుణ్యం సంపాదిస్తే సులభంగా కొలువు సాధించవచ్చునని పలువురు చెబుతున్నారు.

జిల్లాలో ఒక ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చివరి సంవత్సరం 1543 మంది చదువుతున్నారు. వివిధ కంపెనీల్లో ఇప్పటికి 550 మంది మాత్రమే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించారు. ఎంపికైన వారికి సైతం ఆయా కంపెనీలు నియామక పత్రాలు అందజేయలేదు. గతేడాది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మూడు, నాలుగో సంవత్సరం ప్రథమంలో (ఏడో సెమిస్టర్‌లో) ఎక్కువ శాతం కొలువులు సాధించారు. మిగిలిన వారు 8వ సెమిస్టర్‌లో ఎంపికయ్యారు. ప్రస్తుతం 8వ సెమిస్టర్‌ ప్రారంభమైనా సగానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించలేదు. పలు సంస్థలు ఎంపికలు చేపట్టినప్పటికీ ప్యాకేజీని తగ్గించేస్తున్నాయి. గతేడాది ఎంపికైన వారికి ముందు ప్రాధాన్యం ఇస్తూ పిలుస్తుండగా వీరిలో కొంతమందికి వేరే ఉద్యోగం చూసుకోమని సమాచారం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రాంగణ ఎంపికల తేదీలను ప్రకటించి తర్వాత రద్దు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

మారిన పరిస్థితి..

కొవిడ్‌ సమయంలోనూ ఇంజినీరింగ్‌ విద్యార్థులను సంస్థలు అత్యధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. ఇంటివద్దే ఉద్యోగం చేసేలా(వర్క్‌ ఫ్రం హోం) ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ ఎంపికలు జరిగాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎక్కువ కాలం మాంద్యం ప్రభావం పడితే ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


 వేచి చూసే ధోరణి..
- ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, ప్రధానాచార్యులు, ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల, టెక్కలి

గతంలో కొవిడ్‌తో డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. దీంతో దాదాపు ప్రతి కళాశాల నుంచి 80-100 శాతం మందికి కొలువులు దక్కాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో చాలావరకు పెట్టుబడులు తగ్గించి ఉన్నవారికే         లేఆఫ్‌లు ఇస్తూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి.


అవకాశాలకు సిద్ధంగా ఉండాలి..
- పెద్దాడ జగదీశ్వరరావు, డైరెక్టర్‌, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ

ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి. విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ, డేటాసైన్స్‌, కోడింగ్‌ వంటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కోర్సులను నేర్చుకుంటూ వచ్చిన ఏ అవకాశమైనా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.


 అంతటా ఇలాగే ఉంది..
- మొదలవలస గోదావరి, సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు

ప్రస్తుతం యూరోపియన్‌ దేశాలు, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కొవిడ్‌ సమయంలో డిజిటలైజేషన్‌ వల్ల ఆన్‌లైన్‌ తరగతులు, కోర్సులతో అవసరం కంటే ఎక్కువ మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇది తాత్కాలికమే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంటే కొంచెం ఆలస్యమైనా మంచి అవకాశాలు లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని