logo

అడ్డుకట్టేశారు!

మహేంద్రతనయ నదిపై పర్లాఖెముండి వద్ద ఒడిశా అధికారులు ఇసుక బస్తాలతో తాత్కాలిక అడ్డుకట్ట వేయడంతో పాతపట్నం మండలంలో పలు ప్రాంతాలకు నీటికష్టాలు రానున్నాయి.

Published : 07 Feb 2023 06:12 IST

మహేంద్రతనయ ప్రవాహానికి ఒడిశా అడ్డు
పరీవాహక గ్రామాల్లో తాగు, సాగునీటికి ఇక్కట్లు

ప్రవాహానికి ఒడిశా అడ్డుగా వేసిన ఇసుక బస్తాలు

న్యూస్‌టుడే, పాతపట్నం: మహేంద్రతనయ నదిపై పర్లాఖెముండి వద్ద ఒడిశా అధికారులు ఇసుక బస్తాలతో తాత్కాలిక అడ్డుకట్ట వేయడంతో పాతపట్నం మండలంలో పలు ప్రాంతాలకు నీటికష్టాలు రానున్నాయి. ఒడిశా భూభాగంలో పుట్టిన ఈ నది పాతపట్నం వద్ద ఆంధ్రాలో ప్రవేశించి గొట్టాబ్యారేజీ సమీపంలో వంశధారలో కలుస్తుంది. ఈ నది నీరు ఒడిశాతో పాటు జిల్లాలోని పాతపట్నం మండలానికి అత్యంత కీలకం. ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రం పర్లాఖెముండి పట్టణానికి తాగునీటి సరఫరాకు ముందు జాగ్రత్తగా అధికారులు ఈ చర్యకు పూనుకోవడంతో జిల్లాకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. రానున్న వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ప్రవాహం ఆగిపోయి మరిన్ని తాగు, సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.

పర్లాఖెముండి వద్దనే..: మహేంద్రగిరుల నుంచి వస్తున్న ఈ నది నీరు ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరం. ఒడిశాలో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ప్రస్తుతం నదిలో నీటి ఊటలు మాత్రమే ప్రవహిస్తున్నాయి. వీటికీ అడ్డుకట్టవేడయంతో పాతపట్నం నుంచి దిగువ ప్రాంతానికి నీరు దాదాపు ఆగిపోయినట్టే. నదీతీరంలో ఏడు రక్షిత నీటి పథకాలు, రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. పాతపట్నం మండలంలోని పాతపట్నం, గోపాలపురం, కొరసవాడ, కాగువాడ, సీది, హిరమండలం మండలంలోని ధనుపురం గ్రామాల పరిధిలో 30 వేల మంది జనాభాకు ఇదే తాగునీరు. పాతపట్నం, కొరసవాడ గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటికింద రబీలో 400 ఎకరాలకుపైగా సాగయ్యేది. నీటినిల్వల అనిశ్చితి కారణంగా పలువురు సాగు నిలిపేశారు. రక్షిత పథకాలకూ తగినంతగా నీటి నిల్వలు అందడంలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి. స్థానిక అధికారులు, నాయకులు స్పందించి అడ్డుకట్ట తొలగింపునకు చర్యలు తీసుకోకపోతే ప్రవాహం పూర్తి స్థాయిలో ఆగిపోయి పాతపట్నం మేజరు పంచాయతీ ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


వెంటనే స్పందించాలి: ఆంధ్రా ప్రాంతంలో ప్రధానంగా పాతపట్నం మేజరు పంచాయతీతో పాటు పలు గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు మహేంద్రతనయ నదీతీరంలో ఉన్నాయి. వేసవిలో నదిలో నీటి ప్రవాహాన్ని ఒడిశా అధికారులు అడ్డుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తుతుంది. దీని పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఎస్‌.జోగారావు, సర్పంచి ప్రతినిధి, పాతపట్నం


పరిశీలించి చర్యలు: మహేంద్రతనయ నదిలో నీటికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేసి నిలపడం సరికాదు. ఒడిశా నుంచి సాధారణంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నీటిపారుదలశాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి, వారి సూచనల మేరకు తగు చర్యలు చేపడతాం.
 కె.రవిచంద్ర, తహసీˆల్దార్‌, పాతపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని