logo

‘ఈ టీచర్‌ మాకొద్దు’

బూర్జ మండలం పాలవలస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయిని తమకు వద్దంటూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు

Published : 12 Mar 2023 05:54 IST

పాలవలసలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

పాఠశాలలో ఉపాధ్యాయినిని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ మండలం పాలవలస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయిని తమకు వద్దంటూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ప్రధానోపాధ్యాయురాలు వై.మాలతి అధ్యక్షతన పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షల సమయం వస్తున్నందున తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలపాలని హెచ్‌ఎం కోరారు. దీంతో ముక్తకంఠంతో వారంతా సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయిని బి.ప్రసన్నకుమారి తమకు వద్దంటూ తేల్చి చెప్పారు. సరిగ్గా పాఠాలు చెప్పకపోవడంతో పాటు ఏమైనా సందేహాలు అడిగితే బెదిరించడం, సహచర ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం వంటివి చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగే గతేడాది 29 మంది పదో తరగతి విద్యార్థులు కేవలం సాంఘికశాస్త్రంలోనే పరీక్ష తప్పారని నిలదీశారు.

స్పృహ తప్పి.. పడిపోయి..

సాంఘికశాస్త్ర ఉపాధ్యాయిని మాట్లాడుతూ 2017 నుంచి ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నానని, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నట్లు తెలిపారు. గతేడాది సెప్టెంబరు నుంచి ఆరోగ్య సమస్య కారణంగా తాను ఎక్కువగా సెలవులో ఉన్నట్లు చెప్పారు. ఆంగ్లంలో పదో తరగతి విద్యార్థులకు బోధించే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అనంతరం ఉపాధ్యాయిని ఒక్కసారిగా స్పృహ తప్పారు. సపర్యలు చేసిన అనంతరం ఆమెను 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. లోబీపీ కారణంగా స్పృహ తప్పారని, ఎటువంటి సమస్య లేదని వైద్య సిబ్బంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని