logo

సీఎన్జీ ప్లాంటు నిర్మాణం ప్రారంభం

‘ఏజీ అండ్‌ పీ’ ప్రథమ్‌ సంస్థ కాంచీపురం జిల్లాలో ‘కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (సీఎన్జీ) ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం వంటగ్యాస్‌ ధర రూ.1000 దాటింది. ఈస్ట్‌ తాంబరం, షోలింగనల్లూరు, కారపాక్కం, సెమ్మంజేరి, వెస్ట్‌ తాంబరం, పెరుంగుడి ప్రాంతాల్లో నివసిస్తున్న

Published : 22 May 2022 04:43 IST

ఏడు నెలల్లో పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా

చెన్నై శివారు సహా కాంచీపురం, చెంగల్‌పట్టు వాసులకు లబ్ధి

నిర్మాణంలో ఉన్న సీఎన్జీ ప్లాంటు

వడపళని, విల్లివాక్కం, న్యూస్‌టుడే: ‘ఏజీ అండ్‌ పీ’ ప్రథమ్‌ సంస్థ కాంచీపురం జిల్లాలో ‘కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (సీఎన్జీ) ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం వంటగ్యాస్‌ ధర రూ.1000 దాటింది. ఈస్ట్‌ తాంబరం, షోలింగనల్లూరు, కారపాక్కం, సెమ్మంజేరి, వెస్ట్‌ తాంబరం, పెరుంగుడి ప్రాంతాల్లో నివసిస్తున్న గృహవాసులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న పీఎన్జీ కనెక్షన్లకు త్వరలో మారనున్నారు. పైపుల ద్వారా 24 గంటల పాటు సంస్థ మరో 6, 7 నెలల్లో సేవలందించనుంది. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఇప్పటికే సంస్థ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ సంస్థను పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డ్‌’ పంపిణీ దారునిగానూ నియమించింది. ‘పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (పీఎన్జీ)ను ఇళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు సీఎన్జీని వాహనాల వినియోగానికి పంపిణీ చేస్తామని జియో గ్రాఫికల్‌ ఏరియా, ఏజీ అండ్‌ పి ప్రథమ్‌ ప్రాంతీయ అధికారి రంగరాజన్‌ అన్నారు. పీఎన్జీ ధర ఎల్పీజీ సిలిండరు కన్నా 30 నుంచి 40 శాతం తక్కువగానే ఉంటుందని చెప్పారు. గ్యాస్‌ వినియోగాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక మీటరు ఏర్పాటు చేస్తామని, వాడకాన్ని బట్టి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న స్టవ్‌లను వాడుకోవచ్చని, అయితే స్టవ్‌కు గ్యాస్‌ను అందించే ‘నోజెల్‌’ ను మార్చాల్సి ఉంటుందన్నారు. ముందుగా ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీల కింద రూ.6,750 చెల్లించాలని, రూ.6,000 తిరిగి చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు 5,000 కనెక్షన్లకు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో చెన్నై, తిరువళ్లూరు జిల్లాలో 33 లక్షల మంది వినియోగదారులు దీని వాడకానికి ఆసక్తి చూపించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మార్చిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, పైప్‌లైన్‌ల ఏర్పాట్లు జరుగుతున్నాయని ‘గెట్‌ నౌ అండ్‌ పే లేటర్‌’ పథకం కింద నెల రోజుల్లో కనెక్షన్లు పనులు ప్రారంభిస్తామన్నారు. మొత్తం పైపులైన్ల పనులు పూర్తయిన తర్వాత గ్యాస్‌ పంపిణీ జరుగుతుందని, ఏడు నెలల్లో పూర్తవుతుందన్నారు.

సిప్కాట్‌ సమీపంలో మరొకటి

సిప్కాట్‌ సమీపంలోని వల్లంలో ‘లిక్విడ్‌ టు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (ఎల్‌సీఎన్‌జీ) ప్లాంటు నిర్మాణం కూడా జరుగుతోందని రంగరాజన్‌ వివరించారు. ఆగస్టు నుంచి ఇక్కడ సేవలు ప్రారంభమవుతాయన్నారు. ‘లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (ఎల్‌ఎన్‌జీ)కు పెట్రోనెట్‌ సంస్థ లేదా ఎన్నూరులో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి (ఐఓసీ) సాయం పొందనున్నామన్నారు. ఎన్నూరు, తూత్తుకుడి, సిప్కాట్‌ కాంప్లెక్సు మీదుగా బెంగళూరుకు ఐఓసీ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ముందుగా పరిశ్రమల పంపిణీ కోసం 10 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆరు కిలోమీటర్ల వరకు పనులు జరిగాయన్నారు. సాంసంగ్‌, హ్యుందాయ్‌, ఇరుంగాట్టుకోట్టై, ఒరగడంలో ఉన్న కార్ల తయారీ సంస్థలకు సరఫరా చేస్తామని చెప్పారు. తమ ప్లాంటు ప్రారంభం కాగానే పరిశ్రమదారులు ఈ గ్యాస్‌ వైపునకే మళ్లుతారని ఆయన పేర్కొన్నారు. పీఎన్జీ వెసులు బాటు లేని గృహవాసులకు ఎప్పటిలాగానే గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ కొనసాగుతుందని రంగరాజన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని