logo

క్షమాపణ చెప్పిన ఓపీఎస్‌

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కేసును ప్రధాన న్యాయమూర్తికి మారుస్తున్నట్లు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ఆదేశించారు. చెన్నైలో జులై 11వ తేది జరిగిన ఈ సమావేశానికి సంబంధించి ఓపీఎస్‌, వైరముత్తు వేసిన కేసును మద్రాసు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్ రామస్వామి గురువారం విచారించేందుకు జాబితాకు వచ్చింది.

Updated : 06 Aug 2022 05:39 IST

విచారణ కొనసాగిస్తున్న అదే న్యాయమూర్తి

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కేసును ప్రధాన న్యాయమూర్తికి మారుస్తున్నట్లు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ఆదేశించారు. చెన్నైలో జులై 11వ తేది జరిగిన ఈ సమావేశానికి సంబంధించి ఓపీఎస్‌, వైరముత్తు వేసిన కేసును మద్రాసు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్ రామస్వామి గురువారం విచారించేందుకు జాబితాకు వచ్చింది. ఈ కేసును వేరే న్యాయమూర్తికి మార్చాలని ఓపీఎస్‌, వైరముత్తు తరఫున ప్రధాన న్యాయమూర్తి మునీశ్వం్నాథ్‌ భండారీ వద్ద వినతిపత్రం ఇచ్చారు. ఈ కేసు జస్టిస్‌ కృష్ణన్ రామస్వామి ఎదుట గురువారం విచారణకు వచ్చింది. శుక్రవారానికి వాయిదా వేయాలని వైరముత్తు తరఫున కోరారు. దీనిని స్వీకరించిన న్యాయమూర్తి ఆ మేరకు నిర్ణయించారు. కేసును సోమవారానికి వాయిదా వేయాలని ఓపీఎస్‌ తరఫున విన్నవించారు. అందులో... ఈ కేసు న్యాయమూర్తిని మార్చడంపై ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశామని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో శుక్రవారం కేసును విచారణ చేయకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారంకృష్ణన్ రామస్వామికి ఓపీఎస్‌ తరఫున క్షమాపణ చెప్పారు. ఆయనే న్యాయమూర్తిగా కొనసాగాలని విన్నవించారు. ఎవరు విచారణ చేయాలనేది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాలని పేర్కొంటూ కేసును ఆయనకు పంపించాలని కృష్ణన్ రామస్వామి ఆదేశించారు.

‘శశికళ మద్దతుదారులతో కలిసి పని చేయండి?’
సైదాపేట, న్యూస్‌టుడే: శశికళ మద్దతుదారులతో కలిసి పనిచేయాలని అన్నాడీఎంకేలోని తన వర్గం నిర్వాహకులకు పన్నీర్‌సెల్వం సూచించినట్లు సమాచారం. అన్నాడీఎంకే నాయకత్వ పోరుతో పార్టీ, కోర్టు కేసుల్లో ఓపీఎస్‌ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పార్టీని కైవసం చేసుకునేందుకు యత్నాలు కొనసాగిస్తున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సభ్యుల్లో ఎక్కువ శాతం పళనిస్వామికి మద్దతుగా ఉన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో ఇది బహిరంగంగా వ్యక్తమైంది. ఈ ఆధారాలను పళనిస్వామి తరఫున ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం వర్గం పోటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. దీని గురించి పన్నీర్‌ మద్దతుదారుడు కోవై సెల్వరాజ్‌ మాట్లాడుతూ... త్వరలో సమావేశం జరిపేందుకు ఓపీఎస్‌ ప్రణాళిక రచించినట్లు తెలిపారు. అట్టడుగు స్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులు కూడా నిర్వాహకులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శశికళ, టీటీవీ దినకరన్‌ మద్దతుదారులతో కలిసి పని చేయాలని సూచించినట్లు సమాచారం. దీన్ని నిర్ధారించే విధంగా ఇటీవల తేని జిల్లాకు వెళ్లిన టీటీవీ దినకరన్‌కు ఓపీఎస్‌ మద్దతుదారుడు సయ్యద్‌ఖాన్‌ నేతృత్వంలో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇంకా మరికొన్ని జిల్లాల్లో శశికళ, దినకరన్‌లు వెళ్లినప్పుడు స్వాగతం పలికేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శశికళ కూడా తన మద్దతుదారుల వద్ద అన్నాడీఎంకే వారు కలిసి పని చేయాలని సూచించారు. పళనిస్వామి తరఫున కూడా కొంత మంది సీనియర్‌ నేతలు ఓపీఎస్‌, శశికళ కలిసి పళనిస్వామి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు ముందురావాలని చెప్పటం గమనార్హం.

‘రవాణా కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి’
సైదాపేట, న్యూస్‌టుడే: రవాణా కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థల్లో పని చేసే కార్మికుల వేతన పెంపు ఒప్పందం ఖరారును 2019లో చేయాల్సిందని, కరోనా తదితర కారణాలతో జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని